Tollywood: ఎంతో మంది మోసం చేశారు... డబ్బు విలువ ఇప్పుడు తెలిసొచ్చింది: జగపతిబాబు

  • క్యాసినోలకు తిరిగి డబ్బులు పోగొట్టుకోలేదు
  • ఎంతో మంది సినిమా వాళ్లను ఆదుకుని నష్టపోయాను
  • డబ్బు సంపాదించేది ఖర్చు పెట్టేందుకే
  • ఈ తరం విలక్షణ నటుడు జగపతిబాబు
హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించి, ఈ తరం విలక్షణ నటుల్లో ఒకరిగా నిలిచిన జగపతిబాబు నటించిన తాజా చిత్రం 'రంగస్థలం' బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్న వేళ, ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నానని, అందుకు కేవలం తన అలవాట్లు మాత్రమే కారణం కాదని, తన నుంచి డబ్బు తీసుకున్నవాళ్లు ఎంతో మంది మోసం చేశారని చెప్పారు.

ఈ విషయంలో తప్పు తనదేనని, తాను మోసపోయానని, సినిమా కారణంగా దెబ్బతిన్నానని చెప్పిన ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకుని, తన వద్ద ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నానని చెప్పారు. తాను క్యాసినోలకు వెళ్లి జూదం ఆడటం వల్లే డబ్బును కోల్పోయినట్టు పలువురు భావిస్తున్నారని, అది అవాస్తవమని చెప్పారు. ఖర్చు పెట్టడానికే సంపాదించాలని, ఆనందంగా ఉండేందుకు డబ్బు కావాలన్నది తన సిద్ధాంతమని చెప్పారు.

గతంలో డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేశానని, ఇప్పుడు విలువ తెలుసుకుని ఖర్చు పెడుతున్నానని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడటం తన మంచికే జరిగిందని అనుకుంటున్నానని, ఆ స్థితిని స్వయంగా అనుభవించడం వల్లే తిరిగి నిలబడగలిగానని అన్నారు. 'బాహుబలి' చిత్రంలో తాను పోషించదగ్గ పాత్ర లేదని రాజమౌళి భావించి ఉండవచ్చని, అందుకే తాను ఆ చిత్రంలో భాగం కాలేకపోయానని అన్నారు. ఇప్పటివరకూ ఏ దర్శకుడినీ తనతో సినిమా చేయమని కోరలేదని అన్నారు.
Tollywood
Jagapatibabu
Interview
New Movie
Rangasthalam

More Telugu News