Indian Railways: సకల సౌకర్యాలతో సెలూన్ బోగీ ప్రయాణం!

షార్ట్స్‌లో చూడండి
సామాన్యుడికి విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడం కోసం ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) మొట్టమొదటి రైల్వే సెలూన్ బోగీని ప్రారంభించింది. ఈ బోగీ జమ్మూ వెళ్లేందుకు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి శుక్రవారం బయలుదేరింది. దీనిని జమ్మూ మెయిల్ ట్రైయిన్‌కు తగిలించారు. ఈ సెలూన్ బోగీ ఓ కదిలే ఇల్లు మాదిరిగా ఉండి, ఇందులో అటాచ్డ్‌ బాత్రూమ్‌లతో కూడిన రెండు ప్రత్యేకమైన పడక గదులుంటాయి. ఏసీతో పాటు వ్యాలెట్ సర్వీసూ ఉంది. అంతేకాక ఇందులో ఓ అతిపెద్ద లివింగ్ కమ్ డైనింగ్ గది, కిచెన్ కూడా ఉంటాయి. ఇందులో ప్రయాణిస్తున్నప్పుడు మనోహర దృశ్యాలను వీక్షించేలా వెనుకభాగంలో ఓ కిటికీ కూడా ఉంటుందని రైల్వే శాఖ ట్విట్టర్‌లో తెలిపింది.

దీనికి సంబంధించిన ఓ ఫొటోని కూడా అప్ లోడ్ చేసింది. మొట్టమొదటిసారిగా ఆరుగురు వీఐపీ కస్టమర్లతో ఇది బయలుదేరింది. అంతకుముందు రోడ్డు లేదా విమాన సదుపాయం లేని ప్రదేశాలకు చేరుకునేందుకు రైల్వే అధికారులు మాత్రమే దీనిని వినియోగించే వారని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఈ సెలూన్ బోగీ అద్దె సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. హోటల్ ని తలపించే ఈ సెలూన్ బోగీలో ప్రయాణికుల సౌకర్యార్థం ఓ ఏసీ అటెండెంట్, ఓ సెలూన్ అటెండెంట్ అందుబాటులో ఉంటారు. కాగా, అన్ని రైల్వే జోన్లకూ కలిపి మొత్తం 336 సెలూన్ బోగీలున్నాయి. వాటిలో 62 ఏసీ సెలూన్లు.
Go Back to Shorts
Indian Railways
IRCTC
Common Man
AC Saloon
Coach

More Telugu News