Aadhar: ఆధార్ చీఫ్ కు సుప్రీంకోర్టులో 20 ప్రశ్నలు!

  • ఆధార్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు
  • తన సర్వర్లను బ్రేక్ చేయడం అసాధ్యమంటున్న యూఐడీఏఐ
  • డేటా రక్షణకు తీసుకున్న చర్యలేమిటి?
  • ప్రశ్నించిన పిటిషనర్లు
ఆధార్ కార్డుపై నెలకొన్న వివాదాలను పరిష్కరించే దిశగా కీలకమైన కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్న వేళ, యూఐడీఏఐ చీఫ్ అజయ్ భూషణ్ పాండే, 20 కీలక ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానం కీలకం కానుంది. ఇప్పటికే పిటిషనర్లు ఆధార్ భద్రత, వ్యక్తిగత గోప్యత తదితరాంశాలపై ప్రస్తావిస్తూ, ఈ ప్రశ్నలను భూషణ్ పాండేకు కోర్టు ద్వారా అందించారు.

2048-బిట్ ఎన్ క్రిప్షన్ లో దాచి ఉంచిన ఆధార్ డేటాను బ్రేక్ చేయడం అసాధ్యమని, కొన్ని బిలియన్ సంవత్సరాలు శ్రమిస్తేనే అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పాండే కోర్టుకు తెలిపారు. ఆధార్ ఆర్కిటెక్చర్ పై వివరాలు చెప్పాలని, సిస్టమ్ లో తీసుకున్న రక్షణాత్మక చర్యలు ఏంటని, హ్యాకర్లు చొరబడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం చెప్పనున్నట్టు పాండే పేర్కొన్నారు.

అంతకుముందు పిటిషనర్లు తమ తరఫున వాదన వినిపిస్తూ, పాండేను ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని, ఇది దేశ ప్రజల సమస్త సమాచారంతో కూడిన అంశమని వాదించారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. కేసు తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.
Aadhar
Supreme Court
Dipak Mishra
UIDAI

More Telugu News