Vemulawada Rajanna temple: వేములవాడ రాజన్న టెంపుల్‌లో ట్రాన్స్‌జండర్ల సందడి....శివుడితో పెళ్లయినట్లు ప్రకటన...!

  • శ్రీరామనవమి పర్వదినాన వేములవాడ రాజన్న టెంపుల్‌కు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు
  • వధువుల మాదిరిగా అలంకరించుకున్న ట్రాన్స్‌జండర్లు
  • సీతారాముల వారికి పట్టువస్త్రాల సమర్పణ..శివుడితో పెళ్లయినట్లు ప్రకటన
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ట్రాన్స్‌జండర్లు సందడి చేశారు. వధువు అలంకరణతో ముస్తాబైన ట్రాన్స్‌జండర్లు (స్థానికంగా జోగినులుగా వ్యవహరిస్తున్నారు) సీతారాముల విగ్రహాలపై వివాహ మహోత్సవం సందర్భంగా తలంబ్రాలు చల్లారు. అనంతరం ఒకరి తలపై మరొకరు అక్షింతలు చల్లుకున్నారు. ఈ సందర్భంగా శివుడితో తమకు పెళ్లయిపోయిందని, ఆయనే తమ నాథుడని వారు ప్రకటించారు. శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఏటా కన్నులపండువగా జరుగుతుంటాయి.

ఈ ఏడాది కూడా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించేందుకు శనివారం రాత్రి నుంచే తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులు తొలుత ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. శివుడిని పెళ్లి చేసుకునేందుకు జోగినులు వధువుల మాదిరిగా అలంకరణ చేసుకున్నారు. చేతిలో త్రిశూలం ధరించారు. ఈ వివాహ వేడుకను ఆలయ ప్రధాన అర్చకుడు గోపన్నగరి శంకరయ్య పర్యవేక్షించారు. ఆలయ ఈఓ డి.రాజేశ్వర్ దంపతులు, నగర పంచాయతీ ఛైర్‌పర్శన్ నామాల ఉమతో పాటు ట్రాన్స్‌జండర్లు కూడా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
Vemulawada Rajanna temple
Siricilla
Telangana
Trangenders
Sitaramulu
Idols

More Telugu News