Congress: బీజేపీపై జగన్, పవన్ తమ వైఖరి స్పష్టం చేయాలి : జేడీ శీలం

షార్ట్స్‌లో చూడండి
బీజేపీపై జగన్, పవన్ తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర  కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తోంది? అని ప్రశ్నించారు. అదే విధంగా బీజేపీపై, ప్రత్యేక హోదాపై ప‌వ‌న్ త‌న వైఖ‌రిని సృష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ రాజీ లేకుండా పోరాడుతోందని అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయడం తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని, రాష్ట్రంలో తమ పార్టీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరగదని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నాడి తెలుసుకున్నామని, ‘కాంగ్రెస్ పార్టీయే బెటర్’ అని అంద‌రూ అంటున్నారని, కాంగ్రెస్ చేసిన మేలు ప్ర‌జ‌ల‌కు అర్థమవుతోందని అన్నారు.

ఏపీకి చేస్తామని చెప్పిన దాని కన్నా ఎక్కువే చేశామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 27న కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. 
Go Back to Shorts
Congress
seelam
Jagan
Pawan Kalyan
bjp

More Telugu News