ఎందుకీ దాగుడు మూతలు?: చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు
- కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో లెక్కలు వివరించాలి
- అధికారులతో కమిటీ వేసి లెక్కలు కట్టి ప్రజలకు తెలియచేయవచ్చుగా?
- ప్రత్యేక హోదాపై వామపక్షాలతో త్వరలో సమావేశం
"ఎందుకీ దాగుడు మూతలు? కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఇరు ప్రభుత్వాలకు చెందిన అధికారులను కమిటీగా వేసి లెక్కలు కట్టి ప్రజలకు తెలియచేయవచ్చుగా? జనసేన చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అధ్యయనంలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయవచ్చుగా? ఎంతకాలం ఈ ముసుగులో గుద్దులాట? విసిగి వేసారిన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరవధిక ఆందోళనలకు దిగే పరిస్థితులను దయచేసి కల్పించ వద్దని జనసేన పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది.
ప్రత్యేక హోదా తప్ప మిగిలిన వాటి గురించి వినే స్థితిలో ప్రజలు లేరనే యథార్థాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిది. బీజేపీ, తెలుగుదేశం పార్టీల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితిపై చర్చించడానికి త్వరలో వామపక్ష పార్టీల నాయకులతో చర్చలు జరపనున్నాము. ప్రజల కోరికను నెరవేర్చడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తాము. ఆ తరువాత లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వంటి అనుభవజ్ఞులతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, మేధావులతో కూడా సమాలోచనలు జరుపుతాము" అని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.