Karnataka: రండి, మోదీకి దక్షిణాది దెబ్బ రుచి చూపిద్దాం: సౌత్ సీఎంలకు కర్ణాటక సీఎం పిలుపు

  • దక్షిణాది రాష్ట్రాలకు కర్ణాటక సీఎం పిలుపు
  • 15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి 2011 జనాభా లెక్కలు ఆధారంగా తీసుకోవడానికి విముఖత
  • 1971 తరువాత గణనీయంగా పెరిగిన ఉత్తరాది జనాభా
'రండి! దక్షిణాది దెబ్బ మోదీకి రుచి చూపిద్దా'మని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సిద్దరామయ్య ట్విట్టర్ ద్వారా బహిరంగంగా పిలుపునిచ్చారు. 15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడాన్ని సిద్దరామయ్య తీవ్రంగా తప్పుబట్టారు. నిధుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకునేది. 1971 తరువాత ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పెరిగిపోయింది.

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ముస్లింల జనాభా గణనీయంగా పెరిగిపోయిందని ఆ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ నేతలే ఆరోపించిన సంగతి తెలిసిందే. బెంగాల్ లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా చొరబడ్డారని గతంలో పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల పంపిణీ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ లబ్ది పొందుతాయి. దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన సిద్దరామయ్య, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ఈ నిర్ణయాన్ని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తన ట్వీట్ లో ఆరు రాష్ట్రాల సీఎంల ట్విట్టర్ హ్యాండిల్స్‌ ను ఆయన ట్యాగ్ చేయడం విశేషం. అలాగే డీఎంకే నేత స్టాలిన్, కాంగ్రెస్ నేత శశి థరూర్‌ లను కూడా ఆయన ట్యాగ్ చేశారు.

Karnataka
siddaramayya
Andhra Pradesh
Telangana
Tamilnadu
Kerala
Maharashtra
puduccheri

More Telugu News