Maharashtra: వారం రోజుల్లో 3.2 లక్షల ఎలుకలను చంపేశారా? ఎట్టెట్టా?.. మాజీ మంత్రి ఆశ్చర్యం

  • బడ్జెట్ సమావేశంలో ఎలుకల నిర్మూలనపై చర్చ
  • రోజుకు 45,628 ఎలుకలను చంపడం సాధ్యమేనా? అని ప్రశ్న
  • చంపేసిన వాటిని ఎక్కడ పడేశారో చెప్పాలంటూ డిమాండ్
  • పిల్లులతో సింపుల్‌గా చంపేస్తే పని అయిపోయేదంటూ నవ్వులు పూయించిన మాజీ మంత్రి
వారంలో ఏకంగా 3.2 లక్షల ఎలుకలను చంపినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో తాను విస్తుపోయినట్టు మహారాష్ట్ర మాజీ మంత్రి  ఏక్‌నాథ్ ఖడ్సే పేర్కొన్నారు. గురువారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ సచివాలయంలో ఎలుకల నిర్మూలన తీరుపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో 3.2 లక్షల ఎలుకలను చంపడం సాధ్యమయ్యే పనేనా? అని నిలదీశారు.

కాంట్రాక్టర్ చెప్పిన దానిని బట్టి రోజుకు 45,628 ఎలుకలను, అంటే నిమిషానికి 31 ఎలుకలను చంపడం నమ్మశక్యంగా లేదన్నారు. 2015-16లో బీఎంసీ నగరంలో 6 లక్షల ఎలుకలను చంపిందని గుర్తు చేశారు. కాంట్రాక్టర్‌కు ఒక్కో ఎలుకకు రూ.1.5 ఇచ్చినట్టు అసెంబ్లీ బయట విలేకరులకు చెప్పారు.

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఖడ్సే మాట్లాడుతూ.. సచివాలయంలోని ఎలుకలు ఫైళ్లు, కేబుళ్లను కొరికిపారేస్తుండడంతో సాధారణ పరిపాలన విభాగం ఎలుకల నిర్మూలనకు బిడ్లు ఆహ్వానించింది. ఎలుకల నిర్మూలన కోసం వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్‌కు ఆరు నెలల సమయం ఇచ్చింది. అయితే, సదరు కాంట్రాక్టర్ ఏడు రోజుల్లే 3.2 లక్షల ఎలుకలను చంపేసినట్టు పేర్కొన్నాడు.

కాంట్రాక్టర్ చెప్పిన దానిని బట్టి రోజుకు 45,628 ఎలుకలను చంపితే వాటి బరువు 9,125 కేజీలు ఉంటుందని, వాటిని బయటపడేయడానికి ఓ ట్రక్కు అవసరమవుతుందని పేర్కొన్నారు. అయితే చంపిన ఎలుకలను ఎక్కడ పడేశారో కూడా ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఎలుకలను చంపేందుకు కాంట్రాక్ట్ ఇవ్వడం కంటే పది పిల్లులతో పని సులభంగా అయిపోయేదని నవ్వులు పూయించారు.
Maharashtra
rodent
Eknath Khadse

More Telugu News