narayana murthy: 'రూ. 500 రద్దు, రూ. 2000 వినియోగం' లాజిక్ నాకిప్పటికీ అర్థం కాలేదు: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

  • నేను ఆర్థిక వేత్తను కాదు
  • నిరుద్యోగానికి కారణం స్వల్పశ్రేణి తయారీ రంగంపై దృష్టి సారించకపోవడమే
  • స్వల్ప శ్రేణి తయారీ రంగంలోనే ఎక్కువ మందికి ఉపాధి
500 రూపాయల నోటును రద్దు చేసి, 2000 రూపాయల నోటును వినియోగంలోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం లాజిక్ తనకు ఇప్పటికీ అర్థం కాలేదని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. కోల్ కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఆర్థికశాస్త్ర నిపుణుడిని కాదని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు. అయితే ఈ నిర్ణయాన్ని పట్టణ మేధావులు వ్యతిరేకించగా, గ్రామీణ భారతీయులు మాత్రం స్వాగతించారని ఆయన చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయంపై నిపుణులు మాత్రమే సమాధానం చెప్పగలరని ఆయన అన్నారు.

 భారత్ లో నిరుద్యోగానికి కారణం స్వల్పశ్రేణి తయారీ రంగంపై దృష్టి సారించకపోవడమేనని ఆయన అన్నారు. 1950 నుంచి చైనా, జపాన్ లు ఈ రంగంపై దృష్టి సారించగా, మనం మాత్రం దానిని పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. మన దేశంలో స్కూల్ కి వెళ్తున్న చిన్నారుల్లో 75 శాతం మంది 8వ తరగతిలో చేరకముందే బడి మానేస్తున్నారని ఆయన చెప్పారు. వీరందరూ 22 ఏళ్లకు చేరుకునే సరికి వారికి ఉపాధి కల్పించాలని, అలా జరగాలంటే స్వల్పశ్రేణి తయారీరంగంపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. దురదృష్టవశాత్తు భారత్‌ లో స్వల్ప శ్రేణి తయారీ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా మనదేశ ఆర్థికవేత్తలు దీనిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
narayana murthy
infosys

More Telugu News