Chandrababu: ప్రధాని ఆఫీసు చుట్టూ తిరగడం ఎందుకు?: విజయసాయిరెడ్డిపై మండిపడ్డ చంద్రబాబు

  • అవిశ్వాసం పెట్టి.. పీఎంవోలో తిరుగుతున్నారు
  • కేసులు కొట్టేయించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు
  • జైట్లీ తప్పుడు ప్రకటన జనాల్లో ఆవేశాన్ని పెంచింది
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టి... మరోవైపు ప్రధాని కార్యాలయంలో ఎందుకు తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ ద్వంద్వ నీతిని, నీతి బాహ్యమైన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే పీఎంఓలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.

టీడీపీ ఎంపీలతో ఈరోజు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో మీడియాతో అరుణ్ జైట్లీ మాట్లాడిన విషయాలు జనాల్లోకి బాగా వెళ్లాయని... దేశ రక్షణ, సైన్యం నిధులను తాము అడిగామని జైట్లీ చేసిన తప్పుడు ప్రకటన జనాల్లో ఆవేశాన్ని పెంచిందని అన్నారు.

వృద్ధి రేటులో తెలంగాణ కన్నా ఏపీ 2 శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ... తలసరి ఆదాయంలో రూ. 33 వేలు తక్కువగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని... మోదీ ప్రభుత్వంపై తెలుగువారంతా ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలంతా సంఘటితంగా పోరాడాలని సూచించారు. అవిశ్వాసంపై చర్చను జరపడం మినహా... కేంద్ర ప్రభుత్వానికి మరో దారి లేదని అన్నారు.
Chandrababu
Vijay Sai Reddy
pmo
no confidence motion
cases

More Telugu News