WhatsApp: మీ ఫేస్‌బుక్ ఖాతాలను డిలీట్ చేయండి.. వాట్సాప్ సహ వ్యవస్థాపకుడి సంచలన పిలుపు!

  • ట్వీట్‌తో సంచలనం
  • యూజర్ల డేటాను అనధికారికంగా వినియోగించుకున్న కేంబ్రిడ్జ్ అనలిటికా
  • డొనాల్డ్ ట్రంప్ ప్రచార బాధ్యతలు నిర్వహించినది ఈ సంస్థే
  • డేటా లీక్ వార్తలతో దారుణంగా నష్టపోయిన ఫేస్‌బుక్
వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియన్ ఆక్టన్ సంచలన ట్వీట్ చేశారు. తమ ఫేస్‌బుక్ ఖాతాలను ప్రతి ఒక్కరు డిలీట్ చేయాలని పిలుపునిచ్చారు. పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా యూజర్ల అనుమతి లేకుండా ఏకంగా 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను ఉపయోగించుకున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆక్టన్ ఈ పిలుపునివ్వడం గమనార్హం.

వాట్సాప్‌ను 2014లో ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. వాట్సాప్‌ను అమ్మేసినప్పటికీ ఆక్టన్ మాత్రం ఈ ఏడాది జనవరి వరకు కొనసాగారు. అయితే మరో కంపెనీని స్థాపించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మొదట్లో వాట్సాప్ నుంచి బయటకు వచ్చారు.

ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా అనధికారికంగా ఉపయోగించుకుందన్న వార్తలతో ఫేస్‌బుక్ షేర్లు సోమవారం ఒక్కసారిగా ఏడుశాతం పడిపోయాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు ప్రచార బాధ్యతలు నిర్వహించిన బ్రిటిష్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా 5 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల లైకులను అనధికారికంగా ఉపయోగించుకుంది.

ఎన్నికలను ప్రభావితం చేసే ఉద్దేశంతోనే ఈ పనిచేసినట్టు వార్తలు రావడంతో సోమవారం ఫేస్‌బుక్ దారుణంగా నష్టపోయింది. ఈ ఘటనపై స్పందించిన ఫేస్‌బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికాపై సమగ్ర ఆడిట్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. యూజర్ డేటాను దొంగిలించేందుకు అవసరమైన యాప్ రూపొందించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ అలెక్సాండర్ కోగన్ ఈ విషయంలో తమకు సహకరిస్తామని చెప్పారని ఫేస్‌బుక్ తెలిపింది. అలెక్సాండర్ కోగన్‌తో కలిసి పనిచేసిన కెనడాకు చెందిన డేటా నిపుణుడు క్రిస్టఫర్ వైలీనే ఫేస్‌బుక్ డేటా లీక్‌ను మీడియా ఎదుట బయటపెట్టడం గమనార్హం.
WhatsApp
Facebook
Brian Acton
Donald Trump

More Telugu News