Telugudesam: పవన్ కల్యాణ్ మనల్ని ఇంత డ్యామేజ్ చేస్తాడని ఎన్నడూ అనుకోలేదు: చంద్రబాబు

  • పవన్ చేస్తున్నవి నిరాధార ఆరోపణలు
  • కొంతమందైనా నిజమని అనుకునే ప్రమాదం
  • బీజేపీకి కోవర్టుగా మారిన పవన్ కల్యాణ్
  • తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబునాయుడు
పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీపైన, తన కుటుంబంపైన నిరాధార ఆరోపణలతో ఇంత డ్యామేజ్ చేస్తారని ఎన్నడూ అనుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎంపీలతో సుదీర్ఘ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, వివిధ కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నామని పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు లోకేష్ పై పవన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని మరోసారి తేల్చి చెప్పారు.

తన స్వార్థ ప్రయోజనాల కోసం మరొకరి ప్రయోజనాల కోసం పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన, పవన్ వంటి వ్యక్తి ఓ విమర్శ చేసేముందు నిజానిజాలను తెలుసుకోవాలని సూచించారు. తెలుగు ప్రజలు ఎంతో అభిమానించే నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని అన్నారు. ఇంతకాలం నిత్యమూ వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని, తనను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తూ, ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుండేవారని, ఇప్పుడు ఆ పార్టీకి బీజేపీ, జనసేన కూడా కలిశాయని చంద్రబాబు ఆరోపించారు.

బీజేపీకి కోవర్టులుగా పవన్, జగన్ పనిచేస్తున్నారని, ఓ అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా దాన్ని నిజం చేయాలన్న వారి ఆలోచనలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏం చెబితే పవన్ అదే చేస్తున్నారని, పవన్ బాగా విమర్శిస్తున్నారని హరిబాబు వ్యాఖ్యానించడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పోరాడుతుంటే, బీజేపీ చేతిలో పావుగా మారిన పవన్ తమను విమర్శించడం ఏంటని విమర్శలు గుప్పించారు.
Telugudesam
Chandrababu
Pawan Kalyan
Narendra Modi
BJP
YSRCP
jagan

More Telugu News