Parliament: టీడీపీ, వైసీపీ మరో ప్రయత్నం... వేర్వేరుగా అవిశ్వాసం నోటీసులు!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ అధికార ఎన్డీయేపై తెలుగుదేశంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా అవిశ్వాసం నోటీసులు ఇచ్చాయి. కేంద్రానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు, చర్చకు రాకుండానే మురిగిపోయిన నేపథ్యంలో నేడు మరోమారు ప్రయత్నించాలని ఇరు పార్టీలూ నిర్ణయించాయి. అన్నాడీఎంకేతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వెల్ లో నిలబడి నినాదాలు చేస్తుండటంతో, చర్చకు అవసరమైన 50 మంది ఎంపీల లెక్క తేలలేదని చెబుతూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఇక నేడు ఇప్పటికే రెండు పార్టీలూ నోటీసులు ఇవ్వగా, వీటిని మధ్యాహ్నం సభముందుంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నేడు కూడా సభ్యులు నినాదాలు చేయడం ఆపకుంటే శుక్రవారం నాటి పరిస్థితులే పునరావృతం అవుతాయని అంచనా. ఇక సొంతంగా మెజారిటీ ఉన్న నరేంద్ర మోదీ సర్కారుకు అవిశ్వాసంతో పెద్దగా ప్రమాదం లేకున్నా, మొన్నటివరకు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం కాస్తంత ఇబ్బందికర పరిణామం. ఇక అవిశ్వాసంపై చర్చ జరిగితే మోదీ వైఫల్యాలను విపక్షాలు ఎత్తిచూపుతాయి. ఒకవేళ, సభలో ఆమోదించుకోవాల్సిన బిల్లులు ఏమీ లేవని కేంద్రం భావించిన పక్షంలో సభను నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Parliament
Lok Sabha
Telugudesam
YSRCP

More Telugu News