Chandrababu: నన్ను దెబ్బతీయాలనే అలా చేస్తున్నారా.. మీ ప్లాన్‌ ఇదేనా?: చంద్రబాబు

  • వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని ప్రచారం జరుగుతోంది
  • బీజేపీ అధిష్ఠానం చెప్పుచేతుల్లో వైసీపీ నేతలు ఉంటారని ఇలా చేస్తున్నారా?
  • కేసుల్లో ఉన్న జగన్‌తో స్నేహం చేసి ఆయనను గుప్పిట్లో పెట్టుకోవచ్చని ప్లాన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని ప్రచారం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తనను దెబ్బ తీసేందుకే ఇలా చేయాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ నేతలు బీజేపీ అధిష్ఠానం చెప్పుచేతుల్లో ఉంటారని, ఆ పార్టీతో ఇలా చేయించి తద్వారా ప్రత్యేక హోదా ఇస్తారా? అని నిలదీశారు. తనను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, తాను ఏం తప్పుచేశానని ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని, నేరస్తులతో పీఎంవోలో చర్చిస్తూ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. తానైతే కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న మాటలను వినబోనని, కేసుల్లో ఉన్న జగన్‌తో స్నేహం చేసి ఆయనను గుప్పిట్లో పెట్టుకోవచ్చని అనుకుంటున్నారని ఆరోపించారు. విభజన సమయంలోనూ కాంగ్రెస్-వైసీపీ లాలూచీ పడ్డాయని తెలిపారు. అనంతరం విభజన చట్టం, హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై శాసనమండలిలో చంద్రబాబు తీర్మానం పెట్టారు. ఆ తరువాత శాసనమండలి మంగళవారానికి వాయిదా పడింది.  
Chandrababu
Andhra Pradesh
Special Category Status
YSRCP
BJP

More Telugu News