Chandrababu: రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తాం: సీఎం చంద్రబాబు

  • విభజన చట్టంలో పెట్టిన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలి
  • ఏపీ హక్కుల కోసం ఎవరు పోరాడినా వారికి సహకరిస్తాం
  • అవిశ్వాసం పెట్టేవాళ్లు లాలూచీ పడితే చరిత్ర హీనులవుతారు
  • ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా సహకరిస్తామని, తమ మద్దతు ఉంటుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో పెట్టిన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏమాత్రం రాజీపడబోమని అన్నారు. వీటన్నింటిని అమలు చేసే బాధ్యత కేంద్రం తీసుకోవాలని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు.

 ‘కొన్ని రాజకీయపార్టీలు, వ్యక్తులు లాలూచీ పడి మాట్లాడుతున్నారు. ఎవరెవరు ఎక్కడ లాలూచీ పడుతున్నారనే విషయాలను రేపో ఎల్లుండో చెబుతాను. ‘మనమే తెలివైన వాళ్లం’ అని ఎవరైనా అనుకుంటే కుదరదు. ఎందుకంటే, మనకంటే తెలివైన వాళ్లు ప్రజలు. రాగ ద్వేషాలకు అతీతంగా, వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు నిర్ణయం చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా.. మేము కూడా అక్కడ రెడీగా ఉంటాం. అవసరమైతే, మా టీడీపీ ఎంపీలందరూ సహకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఎవరు పోరాడినా వారికి సహకరిస్తాం. అవిశ్వాసం పెట్టేవాళ్లు ఒక వేళ లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే మాత్రం మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని చంద్రబాబు హెచ్చరించారు.
Chandrababu
Telugudesam

More Telugu News