Pawan Kalyan: నన్ను, లోకేష్ ను విమర్శించేందుకేనా పవన్ ఉన్నది: చంద్రబాబు నిప్పులు

  • హోదా సాధన కోసం ఏం చేస్తారో చెప్పలేదు
  • వేరెవరి చేతుల్లోనో కీలుబొమ్మగా మారిన పవన్
  • చౌకబారు విమర్శలతో ప్రచారం కోసమేనన్న చంద్రబాబు
తనను, తన కుమారుడు లోకేష్ నూ విమర్శించడానికే పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్టు కనిపిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా రాలేదన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా పెల్లుబుకుతున్న వేళ, హోదా సాధన కోసం ఏం చేస్తామన్న విషయాన్ని చెప్పకుండా, వేరెవరి చేతుల్లోనో కీలుబొమ్మగా మారిన పవన్, చౌకబారు విమర్శలతో ప్రచారం పొందాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయంలో ఎవరి ప్రయోజనాల కోసం తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారో పవన్ తెలియజేయాలని డిమాండ్ చేశారు.

తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆస్తిపాస్తుల వివరాలను ప్రతి సంవత్సరమూ పారదర్శకంగా మీడియా ముందు బహిర్గతం చేస్తున్నామని వెల్లడించిన ఆయన, ఎన్నికల కోసం కోట్లు కూడబెట్టినట్టు పవన్ చేసిన ఆరోపణలపైనా మండిపడ్డారు. హోదాను ఇవ్వని నరేంద్ర మోదీ గురించి ఒక్క విమర్శ కూడా చేయని ఆయన తీరును చూస్తుంటే తనకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయని ఎమ్మెల్యేలు, మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, లోకేష్ చదువుకుని, ఓ కంపెనీని కూడా నిర్వహిస్తూ, ప్రజా సేవ చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చారని, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లోకేష్ కు లేదని, పవన్ చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రులు కొందరు వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Chandrababu
Nara Lokesh
Andhra Pradesh

More Telugu News