Pawan Kalyan: హోదా కోసం ఆమరణ దీక్ష.. బలిదానం నేనే చేస్తా: పవన్ కల్యాణ్

  • కేంద్రానికి ఇలాగే వదిలేస్తే హామీలివ్వడం, తర్వాత కాదనడం పరిపాటిగా మారుతుంది
  • ఆమరణ దీక్షకు దిగే రోజు వస్తుందనే అనుకుంటున్నా
  • టీడీపీ, వైసీపీ డ్రామాలను గమనిస్తున్నా
  • ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్
గుంటూరు సమీపంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. లేదంటే ఆమరణ దీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు. పార్లమెంటులో ఇచ్చిన మాటకు విలువ ఉండాలని, అమలు చేసి తీరాలని అన్నారు. ఇప్పుడు దీనిని ఇలానే వదిలేస్తే పార్లమెంటులో హామీ ఇవ్వడం, తర్వాత దానిని వదిలేయడం అలవాటుగా మారిపోతుందని విమర్శించారు. తాము పౌరుషం ఉన్నవాళ్లమని, ఓ రోజు ఇస్తాం, మరో రోజు ఇవ్వమని చెబితే చేతులు ముడుచుకుని కూర్చునే రకం కాదన్నారు.

ప్రత్యేక హోదా కోసం అవసరమైతే పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో నిరాహార దీక్ష చేపడతానని పవన్ ప్రకటించారు. ఆ అవసరం వచ్చేలా ఉందన్నారు. తానే బలిదానం చేస్తానని హెచ్చరించారు. తెలుగువాడి తెగింపు, ఆంధ్రుడి ఆత్మగౌరవం ఎలా ఉంటుందో కేంద్రానికి రుచి చూపిస్తామన్నారు. ఆమరణ దీక్షకు కూర్చోవడానికి తాను ఎప్పుడైనా రెడీ అని అన్నారు. టీడీపీ, వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ మీరు చేతులు దులిపేసుకుని వదిలేసినా తాము మాత్రం వదిలేది లేదన్నారు. పార్లమెంటులో డ్రామాలను చూస్తున్నామని, వాటిని నమ్మడానికి చెవిలో పువ్వులు పెట్టుకోలేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏదో ఒకటి చెప్పాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు.
Pawan Kalyan
Guntur
Janasena
Special Category Status

More Telugu News