usa: ట్రంప్ మార్కు... అమెరికా అంటే భారత విద్యార్థుల్లో తగ్గుతున్న క్రేజ్!

  • 2017లో భారత్ నుంచి అమెరికాకు 47,302 మంది
  • అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 27 శాతం తగ్గుదల
  • చైనా విద్యార్థుల్లోనూ గణనీయంగా తగ్గుదల
  • వీసాలపై కఠిన విధానాలతో ప్రత్యామ్నాయ దేశాలకు పయనం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలన మొదలైన తర్వాత, వీసాల పట్ల ఆయన అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ఆ దేశానికి వెళ్లే భారత, చైనా తదితర విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గణాంకాలను పరిశీలిస్తే 2017 సెప్టెంబర్ తో ముగిసిన విద్యా సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య 16 శాతం పడిపోయింది. అంతకుముందు సంవత్సరంలో 5.02 లక్షల మంది విద్యార్థులు అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్లగా, 2017లో 4.21 లక్షలకు పరిమితం అయింది.

భారత్ నుంచి 2016లో విద్యార్థి వీసాలపై వెళ్లిన వారి సంఖ్య 65,257 కాగా, 2017లో కేవలం 47,302 మంది విద్యార్థులే ఆ అవకాశం అందిపుచ్చుకున్నారు. అంటే ఏకంగా 27 శాతం తగ్గిపోయినట్టు. ఇక చైనా విద్యార్థులు 1,52,120 మంది 2016లో అమెరికా విద్యకు వెళ్లగా 2017లో ఈ సంఖ్య 1,16,019కు తగ్గుముఖం పట్టింది. ట్రంప్ సర్కారు హెచ్ 1బి ఉద్యోగ వీసాల విషయంలో అనుచిత విధానాలతో విసిగిన భారత, చైనా విద్యార్థులు కెనడా, ఆస్ట్రేలియా తదితర ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకోవడం గమనించొచ్చు.

More Telugu News