Chandrababu: అసెంబ్లీలో విభజనపై మాట్లాడుతూ చంద్రబాబు భావోద్వేగం... చమ్మగిల్లిన కళ్లు!

  • హోదాను ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేసిన కేంద్రం
  • తాజాగా రైల్వే జోన్ కూడా హుళక్కేనని సంకేతాలు
  • పలు అంశాలను ప్రస్తావిస్తున్న వేళ చెమ్మగిల్లిన చంద్రబాబు కళ్లు
  • హామీల అమలుకు ఎందాకైనా వెళతానని స్పష్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో పాటు రైల్వే జోన్ కూడా ఇచ్చే అవకాశాలు లేవన్న సంకేతాలు రావడంతో, రాష్ట్రానికి  జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబునాయుడు భావోద్వేగానికి గురయ్యారు. చెమ్మగిల్లిన కళ్లతోనే ప్రసంగిస్తూ, తన సంకల్పాన్ని అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన గొంతు ఒక్కసారిగా వణకడంతో  అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలంతా నిశ్చేష్ఠులయ్యారు.

తన ప్రసంగంలో ఇచ్చిన విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసిన ఆయన, తెలుగు ప్రజలు గర్వపడేలా ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించి చూపిస్తానని శపథం చేశారు. కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఏ విభాగానికి ఎంత నిధులు వచ్చాయో లెక్కలు వివరించిన ఆయన, అమరావతి ప్రస్తావనకు వచ్చిన తరువాత గద్గద స్వరంతో మాట్లాడారు. రాజధానికి చెప్పిన సాయం చేయని కేంద్రం, తన సంకల్పాన్ని ఎగతాళి చేస్తోందని ఆరోపించారు.

 రైతులు స్వచ్ఛందంగా దాదాపు 40 వేల కోట్ల విలువైన భూములను ఇస్తే, బాధ్యతగల ప్రభుత్వాలుగా వారికి ఏమీ చేయలేకపోతున్నామని, ఇది తనకు ఎంతో బాధను కలిగిస్తోందని తెలిపారు. అమరావతిలో భవనాల నిర్మాణానికి రూ. 1500 కోట్లు ఇచ్చి, గుంటూరు, విజయవాడ నగరాలకు ఇచ్చిన రూ. 1000 కోట్లను కూడా అమరావతి లెక్కలోనే కలిపారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని, అందుకోసం ఎందాకైనా వెళతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News