Haseeb Drabu: కశ్మీర్ రాజకీయ అంశం కాదని నోరు పారేసుకున్న మంత్రి.. ఊడిన పదవి!

  • మంత్రి డబ్రు వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం
  • ఆయనను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ గవర్నర్‌కు సీఎం లేఖ
  • వివరణ ఇవ్వాల్సిందిగా కోరిన పీడీపీ
జమ్ముకశ్మీర్ రాజకీయ అంశం కాదన్నందుకు ఓ మంత్రి పదవి ఊడింది. ఢిల్లీలో ఈనెల 9న నిర్వహించిన పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న కశ్మీర్ ఆర్థికశాఖా మంత్రి డాక్టర్ హసీబ్ డబ్రు మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసినంత వరకు జమ్ముకశ్మీర్ రాజకీయ అంశం కాదు. కానీ, దీనిని గత 70 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు లేఖ రాశారు. మంత్రివర్గం నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. స్పందించిన గవర్నర్ తిరిగి సీఎంకు లేఖ రాస్తూ ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు.

డబ్రు వ్యాఖ్యలపై అధికార పార్టీతో పాటు, విపక్షాలు, వేర్పాటువాద నేతలు, వాణిజ్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా పీడీపీ ఉపాధ్యక్షుడు సర్తాజ్ మద్ని డబ్రును ఆదేశించారు. అనంతరం కేబినెట్ నుంచి ఆయనను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Haseeb Drabu
Jammu And Kashmir
Mehbooba Mufti

More Telugu News