Telangana: గవర్నర్ ప్రసంగంలో ఉన్నదంతా అసత్యమే, అందుకే, అడ్డుకునేందుకు యత్నించాం : కోమటిరెడ్డి

  • ఆశాజనకంగా లేని బడ్జెట్
  • ఈ బడ్జెట్ ఓ చిత్తు కాగితంతో సమానం
  • నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు కూడా వెళ్లనీయలేదు
  • యాభై మంది మార్షల్స్ ను పెట్టి రౌడీలా ప్రభుత్వం ప్రవర్తించింది
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు తొలిరోజునే అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం,. గవర్నర్ నరసింహన్ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కొంచెం సేపటికే కాంగ్రెస్ నేతలు తమ నిరసన వ్యక్తం చేయడం విదితమే. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడమే కాకుండా, గందరగోళం సృష్టించారు. ఈ విషయమై మీడియాతో కోమటిరెడ్డి మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంలో ఉన్నదంతా అసత్యమేనని, అందుకే, ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నామని అన్నారు. ‘ఆయన (గవర్నర్) రావడమే సభకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.

గవర్నర్ ప్రసంగం పుస్తకాలు మాకు ఇచ్చారు. ఇది చివరి బడ్జెట్. ఈ బడ్జెట్ రైతులకు, నిరుద్యోగులకు, వెనుకబడిన కులాలకు ఆశాజనకంగా ఉంటుందని భావించాం కానీ, ఈ బడ్జెట్ ఓ చిత్తు కాగితంతో సమానం. ఇరవై ఐదు నిమిషాల్లోనే బడ్జెట్ ప్రసంగం ముగిసిందంటే.. ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ లేదనే విషయం అర్థమవుతోంది. ఈ బడ్జెట్ పై నిరసన తెలియజేసేందుకు పోడియం వద్దకు వెళ్దామనుకున్నాం. కనీసం, పోడియం వద్దకు కూడా మమ్మల్ని పోనీయకుండా యాభై మంది మార్షల్స్ ను పెట్టి, రౌడీలాగా ప్రభుత్వం ప్రవర్తించింది. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది. నన్ను, రామ్మోహన్ ను నెట్టి, కొట్టి కిందపడేశారు. నా కాళ్లకు గాయాలయ్యాయి’ అని చెప్పుకొచ్చారు.
Telangana
Congress
komatireddy

More Telugu News