Rajya Sabha: సీఎం రమేష్, వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్... దురదృష్టవంతుడెవరో?

  • త్వరలో రాజ్యసభ ఎన్నికలు
  • ఏపీకి మూడు స్థానాలు
  • టీడీపీకి రెండు, వైకాపాకు ఒకటి ఖాయం
  • టీడీపీ నుంచి రేసులో ముగ్గురు
  • కసరత్తు చేస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అతి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ, అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం అధిష్ఠానం తలమునకలై ఉంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నిక జరగనుండగా, ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల బలాబలాలను బట్టి తెలుగుదేశం పార్టీకి రెండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం రమేష్, వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్ ల పేర్లను తుది దశ పరిశీలనకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం. వీరిలో సీఎం రమేష్ ఇప్పటికే ఓ మారు రాజ్యసభ పదవీకాలాన్ని పూర్తి చేసుకుని మరోమారు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్లమెంట్ లో ఆయన చూపించే దూకుడు, ప్రత్యేక హోదాపై నిరసనలు మరింత జోరుగా తెలియజేయాల్సిన వేళ, రమేష్ వంటి యువనేత ఉంటే బాగుంటుందని చంద్రబాబు భావిస్తుండటంతో ఆయనకు మరో చాన్స్ ఖాయంగా తెలుస్తోంది. ఇక మరో స్థానానికి ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఓ దశలో సీఎం రమేష్ బదులు వీరిద్దరికే సీట్లను కేటాయిస్తారని ప్రచారం జరిగినా, ప్రస్తుతం ఇద్దరిలో ఒకరికి మాత్రమే చాన్స్ లభించే పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగితే, మూడో స్థానాన్ని సైతం కైవసం చేసుకోవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మూడో అభ్యర్థిని పోటీకి దింపాలని, ఆపై జరిగేది చూద్దామని అధినేతకు చెబుతున్నారు. అదే జరిగితే, ఏకగ్రీవం స్థానంలో ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు తొలి ప్రాధాన్యతా ఓట్లు విజయానికి సరిపడా తెచ్చుకోలేకుంటే, రెండో ప్రాధాన్యతా ఓట్లు కీలకం అవుతాయి. ఇక చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికకు మొగ్గుచూపి ఇద్దరినే బరిలో ఉంచుతారా? లేక పోటీకే సై అంటారా అన్నది వేచి చూడాలి.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపులు ఉంటాయని ఊహించలేం. ఆ పార్టీ ఓ అభ్యర్థిని ఖాయంగా గెలిపించుకునే స్థితిలో ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక సీఎం రమేష్, వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్ లలో రాజ్యసభలోకి కాలు పెట్టే ఇద్దరు అదృష్టవంతులు ఎవరో, దురదృష్టవంతుడిగా మిగిలేది ఎవరో మరో ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది.
Rajya Sabha
Telugudesam
YSRCP
CM Ramesh
Varla Ramaiah
mastan yadav

More Telugu News