Chandrababu: 11 కేసుల్లో ఏ-1గా ఉన్న వ్యక్తిని నేను అనుసరించాలా?: చంద్రబాబు

  • జగన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • రాజకీయాలు జగన్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు
  • పార్లమెంట్ వద్ద నిరసనలు కొనసాగించండి
  • ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
ఆక్రమాస్తులు, క్విడ్ ప్రోకోలకు సంబంధించి 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాను అనుసరించడం ఏంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాము అవిశ్వాసం పెడతామని, టీడీపీ మద్దతివ్వాలని జగన్ డిమాండ్ చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. జాతీయ రాజకీయాలను జగన్ దగ్గర తానిప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.

టీడీపీ తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో పలు పార్టీల అభిప్రాయాలను ఇప్పటికే అడిగి తెలుసుకున్నానని, ఎన్నో పార్టీలు మద్దతు పలికాయని వెల్లడించారు. పలు పార్టీలు టీడీపీకి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ప్రత్యేక హోదాను ప్రజలు తమ హక్కుగా భావిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలను, హక్కులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తేలేదని అన్నారు. మనమేమీ గొంతెమ్మ కోరికలను కోరడం లేదని, చట్టంలో ఉన్నవే అడుగుతున్నామని స్పష్టం చేశారు. నాలుగేళ్ల పాటు ఎదురుచూసినా ఫలితం రానందునే రాజీనామాలు చేశామని తెలిపారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రజా ప్రయోజనాల కోసమే కేంద్రం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. పార్లమెంట్ వేదికగా ఎంపీలు తమ నిరసనలను కొనసాగించాలని ఆదేశించారు.
Chandrababu
Jagan
Telugudesam
YSRCP

More Telugu News