Andhra Pradesh: ఏపీకి అన్యాయం చేసి కాంగ్రెస్ మట్టి కరిచింది.. అదే పరిస్థితి మీకూ వస్తుంది: పల్లె రఘునాథ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రంపై అంకిత భావం గానీ, అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి గానీ లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... విభజన హామీలకు సంబంధించిన 19 అంశాలను కేంద్ర సర్కారు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్లి హామీల విషయం గుర్తు చేసి వేడుకున్నా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.

రాష్ట్రాభివృద్ధికి తాము నిధులు కావాలని కోరితే, సైనికులకు కేటాయించిన బడ్జెట్లో నుంచి ఇవ్వాలా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెటకారంగా మాట్లాడారని పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. బుందేల్ ఖండ్ కి రూ.20 వేల కోట్లు, ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్ కు రూ.80 వేల కోట్లు ప్రకటించారని, తమకు ఎందుకు ఇవ్వరో సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేసి మట్టి కరిచిందని, అదే పరిస్థితి మీకూ వస్తుందని ఆయన హెచ్చరించారు.

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కు రూ.7740 కోట్లు ఇవ్వాలని, అయితే ఇప్పటికి రూ.4321 కోట్లు మాత్రమే ఇచ్చారని పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రావలసిన 11 జాతీయ సంస్థలలో ఇంకా 2 పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. రాజధానిని నిర్మించే బాధ్యత తనదేనన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికి భవనాల నిర్మాణానికి కేవలం రూ. 1500 కోట్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.1000 కోట్లు మాత్రమే ఇచ్చారని వివరించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలకు విలువలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో బలం ఉందికదా అని హామీలు నెరవేర్చకపోతే ప్రజలు దానికి తగిన విధంగా స్పందిస్తారని పల్లె హెచ్చరించారు. 
Go Back to Shorts
Andhra Pradesh
palle
Special Category Status
BJP
Telugudesam

More Telugu News