chidambaram: హిందుస్థాన్‌ 'లీవర్స్‌'ను వదిలి, హిందుస్థాన్‌ 'రిటర్నర్స్‌'ను ఇబ్బందిపెడుతున్నారు!: కార్తీ చిదంబరం అరెస్టుపై అభిషేక్ సింఘ్వి

  • యూరప్ లో ముడుపుల ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందన్న సీబీఐ న్యాయవాది  
  • ఒకరోజు పోలీస్ కస్టడీకి అప్పగింత
  • లండన్ పర్యటన రద్దు చేసుకున్న తండ్రి చిదంబరం 
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ అధికారులు చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. లండన్‌ లోని కళాశాలలో కుమార్తెను చేర్పించి వచ్చిన ఆయనను సీబీఐ అధికారులు విమానాశ్రయంలో అడ్డుకున్నారు. గంటసేపు అక్కడే ఆయనను విచారించారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్టు చెప్పి, మరో విమానంలో నేరుగా ఢిల్లీ తీసుకెళ్లారు.

దాంతో, ఆయన కోసం విమానాశ్రయం బయట ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయనను అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తలు విని కన్నీటి పర్యంతమయ్యారు. ఢిల్లీకి చేరుకోగానే సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించి, అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి పటియాలా హౌస్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానంలో కార్తీ చిదంబరం తరపున అభిషేక్ సింఘ్వి వాదించారు.

గత తొమ్మిది నెలలుగా సీబీఐ, ఈడీలు అడిగినప్పుడల్లా కార్తీ హాజరై విచారణకు సహకరిస్తున్నారని, ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరమేంటని ఆయన సీబీఐని ప్రశ్నించారు. రాజకీయ బాస్‌ లను సంతృప్తిపరచేందుకు సీబీఐ ఆయనను అరెస్టు చేసిందని ఆయన ఆరోపించారు. హిందుస్థాన్‌ 'లీవర్స్‌'ను (దేశాన్ని వదిలి వెళ్లిన మాల్యా, నీరవ్‌ మోదీ) ఏమీ చేయలేకపోయిన సర్కారు.. హిందుస్థాన్‌ రిటర్నర్స్‌ ను (దేశానికి తిరిగి వచ్చిన కార్తీ చిదంబరం) ఇబ్బందుల పాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

ఆ సమయంలో సీబీఐ తరపు న్యాయవాది ఆయన వాదనకు అభ్యంతరం చెబుతూ, కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకొని కార్తీ పదేపదే యూరప్ వెళ్లి వస్తున్నారని, అక్కడ ముడుపుల ఆధారాలను మాయం చేసే అవకాశం ఉందని వాదించారు. దీంతో సీబీఐ ఆయనను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతించింది. కార్తీ తల్లి, న్యాయవాది నళిని ఆ సమయంలో కోర్టులోనే ఉన్నారు. లండన్‌ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాల్సి ఉన్న తండ్రి చిదంబరం, లండన్ పర్యటనను రద్దు చేసుకొని కష్టకాలంలో తనయుడి దగ్గర ఉండేందుకు ఢిల్లీ పయనమయ్యారు.
chidambaram
karti chidambaram
abhushaik singhvi

More Telugu News