Kadiam Srihari: మెడికల్ కాలేజీల్లో అప్పట్లో 80 శాతం అబ్బాయిలు ఉండేవారు.. ఇప్పుడేమో సీన్ రివర్స్!: కడియం శ్రీహరి
- ఇప్పుడు 80 శాతం అమ్మాయిలు, 20 శాతం అబ్బాయిలు
- ఇంజనీరింగ్ కాలేజీల్లో 60 శాతం అమ్మాయిలు, 40 శాతం అబ్బాయిలు
- అన్ని రకాల కోర్సుల్లో అమ్మాయిలే ఎక్కువగా ఎన్ రోల్ మెంట్
- బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నాం
తెలంగాణ ప్రభుత్వం బాలికల విద్యను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ వార్షికోత్సవానికి హాజరైన కడియం శ్రీహరి... చదువులో ప్రతిభ కనబరుస్తోన్న స్వప్న అనే విద్యార్థినికి 10 వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. వనితా మహా విద్యాలయ న్యాక్ నుంచి మంచి గ్రేడ్ పొందడాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.
మెడికల్ కాలేజీల్లో గతంలో 80 శాతం అబ్బాయిలు, 20 శాతం అమ్మాయిలుంటే... ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని, 80 శాతం అమ్మాయిలు, 20 శాతం అబ్బాయిలుంటున్నారని కడియం శ్రీహరి చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో 60 శాతం అమ్మాయిలు, 40 శాతం అబ్బాయిలుంటున్నారని తెలిపారు. అన్ని రకాల కోర్సుల్లో అమ్మాయిల ఎన్ రోల్ మెంటే ఎక్కువగా ఉంటుందన్నారు.
బాలికల విద్యను ప్రోత్సహించే ఇలాంటి మంచి కాలేజీలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని కడియం శ్రీహరి అన్నారు. ఈ కాలేజి సమస్యలను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు.
ఇందులో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, బంగారు తెలంగాణ సాధించే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోందని కడియం శ్రీహరి చెప్పారు. దీనికి అనుగుణంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని గురుకులాలను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 296 గురుకులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 470 గురుకులాలను ఏర్పాటు చేసుకోవడంతో ఇపుడు అవి 840కి చేరుకున్నాయని చెప్పారు.
12వ తరగతి తరవాత ఎస్సీ, ఎస్టీ బాలికలు విద్య మానేస్తున్నారని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ 53 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. యూనివర్సిటీ లను బలోపేతం చేసేందుకు 420 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారన్నారు.ఇటీవల అన్ని విద్యా సంస్థల్లో బాలికలు ముందంజలో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. వార్షికోత్సవంలో భాగంగా అత్యధిక మార్కులు పొందిన బాలికలకు గోల్డ్ మెడల్స్, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ వసంతరావు, కార్యదర్శి నరోత్తమరెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ విజయశ్రీ, కాలేజీ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.