మా ఢిల్లీ ఎలక్షన్ రికార్డును బద్దలు కొట్టే శక్తి అతనికి మాత్రమే ఉంది: కేజ్రీవాల్

విలక్షణ నటుడు కమలహాసన్ కు తాను రాజకీయ అండగా నిలుస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నిన్న కమల్ ప్రారంభించిన 'మక్కల్ నీది మయ్యమ్' (ఎంఎన్ఎం) పార్టీ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన, మూడేళ్ల క్రితం ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 67 చోట్ల ఆప్ సాధించిన విజయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ సాధించిన ఎన్నికల రికార్డును బద్దలు కొట్టే శక్తి కమలహాసన్ కు మాత్రమే ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తమిళ ప్రజలను ఆయన కోరారు.

కమలహాసన్ ఓ నిజమైన హీరో అని, తమిళనాడు ప్రజలకు ఆయనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కనిపిస్తున్నారని అన్నారు. ఢిల్లీలోనూ ఒకప్పుడు ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభమే కనిపించిందని, అప్పట్లో దేశ రాజధాని ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకున్నట్టే, ఇప్పుడు తమిళ ప్రజలూ అదే పని చేస్తారని తాను నమ్ముతున్నానని అన్నారు. కమల్ నీతిమంతుడని, ఆయనకు గొప్ప దృష్టి ఉందని, ఆయన ధైర్యాన్ని తాను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నానని అన్నారు. తాను కమల్ అభిమానినని చెప్పారు.


More Telugu News