Andhra Pradesh: వైసీపీ శిక్షణా తరగతుల్లో గందరగోళం.. మల్లాది విష్ణు అలక, రాధా అనుచరుల హంగామా!

  • గుడివాడ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశం
  • రాధాను ఎందుకు ఆహ్వానించలేదంటూ అనుచరుల హంగామా 
  • సర్దిచెప్పిన వైసీపీ నేతలు..ఆలస్యంగా హాజరైన రాధా
  • వేదికపైకి వెళ్లకుండా అలక బూనిన మల్లాది విష్ణు
విజయవాడలో నిర్వహించిన వైసీపీ శిక్షణా తరగతుల్లో నేతల మధ్య అభిప్రాయ భేదాలు బహిర్గతమయ్యాయి. వంగవీటి రాధా అనుచరులు హంగామా సృష్టించారు. గుడివాడ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశం ఈరోజు నిర్వహించారు. దీనికి వంగవీటి రాధాను ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘జై రాధ, జై రంగా’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో, వైసీపీ నేత సామినేని ఉదయభాను కల్పించుకుని వారిని సముదాయించారు. ఈ శిక్షణా తరగతులకు హాజరుకావాలని రెండు రోజులుగా రాధాను ఆహ్వానిస్తున్నామని, ఆయన వస్తారని సామినేని చెప్పడంతో ఆయన అనుచరులు శాంతించారు. ఈ తతంగం జరిగిన కొంచెం సేపటి తర్వాత రాధా అక్కడికి వచ్చారు.  

అసహనానికి గురైన మల్లాది విష్ణు

ఈ సమావేశానికి వైసీపీ నేత మల్లాది విష్ణు కూడా హాజరయ్యారు. వేదికపైకి రావాలంటూ విష్ణును ఆహ్వానించినప్పటికీ ఆయన వెళ్లలేదు. దీంతో, వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్ కల్పించుకుని విష్ణుని వేదికపైకి రావాల్సిందిగా కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే, ‘జై రాధ, జై రంగా’ నినాదాలతో రాధా అనుచరులు హోరెత్తించడంపై మల్లాది విష్ణు ఒకింత అసహనానికి గురయ్యారు.  
Andhra Pradesh
YSRCP

More Telugu News