Kadapa District: ఒంటిమిట్ట చెరువులో ఐదుగురి ‘జల సమాధి’.. తమిళ కూలీలుగా గుర్తింపు!

  • నీటిపై తేలియాడుతున్న శవాలను చూసిన రైతు సుబ్బారాయుడు
  • ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావించిన గ్రామస్థులు
  • మృత్యువాత పడింది తమిళ కూలీలుగా గుర్తించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు

కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో ఐదుగురి మృతదేహాలు వెలుగుచూడడం కలకలం రేపింది. ఆదివారం ఉదయం చెరువు సమీపంలో పంట సాగు చేస్తున్న రైతు సుబ్బారాయుడు తన పొలానికి వెళుతూ నీళ్లపై తేలియాడుతున్న మృతదేహాలను గమనించారు. అనంతరం ఊర్లోని వారికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావించి, పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

వారు మృతదేహాలను పరిశీలించి, మృత్యువాత పడింది తమిళ కూలీలుగా గుర్తించారు. రెండు రోజుల క్రితమే వారు మరణించగా, మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారి, కుళ్లిపోయిన స్థితిలో నీటిపై తేలియాడినట్టు నిర్ధారణకు వచ్చారు. అనంతరం ఆ ఐదు మృతదేహాలను గజ ఈతగాళ్లు, అగ్నిమాపకశాఖ సిబ్బంది సాయంతో ఒడ్డుకి చేర్చారు.

మృతులు ఐదుగురూ టీ షర్టులు ధరించి లుంగీలతో ఉన్నారు. నడుముకు టవల్‌ తో కొంత సామగ్రి వీపుకు కట్టుకున్నారు. వీపుపై కిట్‌ బ్యాగులు కూడా ఉన్నాయి. వాటిలో తినుబండారాలు, సెల్‌ ఫోన్లు, వంట సామగ్రిని గుర్తించిన పోలీసులు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ కు వచ్చిన తమిళ కూలీలుగా నిర్ధారణకు వచ్చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌ కు తరలించారు. వీరివి హత్యలా? లేక ఆత్మహత్యలా అన్నది తేలాల్సి వుంది. 

More Telugu News