Gundu Hanumantha Rao: ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ!

  • గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు
  • 18 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి..
  • 400కుపైగా సినిమాల్లో నటించిన గుండు..
  • అమృతం సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ పరిశ్రమ
ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు (61) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదు, ఎస్‌ఆర్ నగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సాయంత్రం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అక్టోబరు 10, 1956లో విజయవాడలో జన్మించిన హనుమంతరావు 18 ఏళ్ల వయసులో నాటకాల్లోకి ప్రవేశించారు. నాటకాల్లో ఆయన తొలిసారి రావణబ్రహ్మ వేషాన్ని వేశారు. తర్వాత స్టేజి షోలతో బాగా పాప్యులర్ అయ్యారు. ‘సత్యాగ్రహం’ సినిమాతో చిత్రపరిశ్రమలో కాలుమోపారు. మొత్తం 400 సినిమాల్లో నటించారు. అమృతం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మూడుసార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందు హనుమంతరావు స్వీట్ షాపు నిర్వహించేవారు.

2010లో ఆయన భార్య మృతి చెందారు. ఆయనకు ఓ కుమారుడు ఉన్నారు. బాబాయి హోటల్, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం రా, సత్యం, పెళ్లాం ఊరెళితే, అతడు, భద్ర, ఆట, మస్కా.. తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించారు. హనుమంతరావు మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Gundu Hanumantha Rao
Tollywood
Actor

More Telugu News