Transgender woman: పాపకు మురి'పాలు'.. అసలైన మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న లింగమార్పిడి మహిళ!

  • పాల ఉత్పత్తి కోసం కొన్నేళ్లుగా హోర్మోన్ చికిత్స
  • ఆరు వారాల పాటు పాపకు పాలిచ్చిన ట్రాన్స్‌జండర్
  • ఇలాంటి ప్రయత్నం ప్రమాదకరమని కొందరి వార్నింగ్

లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఓ మహిళ అందరి లాగే తన బిడ్డకు తన పాలు పట్టాలని ఆశపడింది. ఎట్టకేలకు తన కోరికను ఆమె నెరవేర్చుకుంది. 'ట్రాన్స్ జండర్ హెల్త్' జర్నల్‌లో ప్రచురితమయిన కథనం ప్రకారం, 30 ఏళ్ల లింగమార్పిడి మహిళ గర్భందాల్చిన తన భాగస్వామికి పుట్టబోయే బిడ్డకు పాలివ్వాలని కోరుకుంటున్నట్లు న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రి వైద్యులకు తెలిపింది. ఇది సాధ్యమయ్యేలా చేయాలని వారిని వేడుకుంది. దాంతో వారు ఆమెకు సంబంధిత హోర్మోన్ల ఉత్పత్తి కోసం కొన్ని రకాల చికిత్సలు చేశారు. చికిత్స తీసుకున్న నెలలోపే ఆమెకు పాలు ఉత్పత్తయ్యాయి.

చికిత్స మొదలెట్టిన నెలరోజుల్లోపే క్షీరగ్రంధులు స్రవించడం మొదలైంది. మూడు నెలల్లోనే అంటే మరో రెండు వారాల్లో బిడ్డ పుట్టనుందనగా ఆమెకు రోజుకు ఎనిమిది ఔన్సుల పాలను ఇచ్చే సామర్థ్యం వచ్చింది. అధ్యయనంలో పేర్కొన్న విధంగా, చివరకు, ఆమె తన బిడ్డకు ఆరు వారాల పాటు తగినంత పాలను పట్టే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సంబంధిత వైద్యులు మాట్లాడుతూ, లింగమార్పిడి మహిళలు కూడా హార్మోన్ థెరపీతో తమ బిడ్డలకు చక్కగా పాలివ్వగలుగుతారని తేలిందని చెప్పారు.

లింగమార్పిడి మహిళ బిడ్డకు పాలివ్వడం అనేది ఆయా కుటుంబాలకు ఓ గొప్ప మలుపు అంటూ జనవరిలో ప్రచురితమయిన ఈ అధ్యయనాన్ని కొంతమంది మెచ్చుకున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది ప్రమాదకరమని, ఇబ్బందికరమైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, 2011లో లింగమార్పిడి చికిత్సలో భాగంగా ఈ అధ్యయనంలో పేర్కొన్న ట్రాన్స్ జండర్ మహిళ హార్మోన్ సంబంధిత చికిత్స కోసం వైద్య నిపుణులను సంప్రదించింది. పాలు ఇవ్వడానికి ముందుగా ఆమె చాలా ఏళ్లుగా ఈ చికిత్స చేయించుకుంది. పాలివ్వడం కోసం ఆమె మళ్లీ లింగమార్పిడి సర్జరీ చేయించుకోకపోవడం గమనార్హం.

More Telugu News