Pawan Kalyan: పవన్ తన జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచి పని ఇది... అందుకే ఎన్ని పాపాలు చేసినా పోతున్నాయి: టీవీ9 లైవ్ లో బీజేపీ నేత సుధీష్ రాంబొట్ల

  • సినిమాకు, సినిమాకు మధ్య పవన్ పాలిటిక్స్
  • వర్తమాన రాజకీయాలపై అవగాహనే లేదు
  • మోదీ నాయకత్వాన్ని నాడు బలపరచడమే ఆయన పుణ్యం
  • మట్టిని, నీటిని అవమానించ వద్దని హితవు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాకు, సినిమాకు మధ్య పాలిటిక్స్ చేస్తున్నారని, ఆయనకు వర్తమాన రాజకీయాలపై ఎంతమాత్రమూ అవగాహన లేదని బీజేపీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీవీ9లో జరిగిన లైవ్ డిస్కషన్ లో పాల్గొన్న ఆయన, పవన్ కల్యాణ్ తన జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచిపని 2014లో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచడమేనని, అందుకే ఆయన తన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా అవన్నీ తుడిచిపెట్టుకు పోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం విష్ణుకుమార్ రాజు ప్రెస్ మీట్ పెట్టి, ఏపీకి కేంద్రం నుంచి అందిన సాయంపై 20 పేజీలకు పైగా వివరాలను విడుదల చేశారని, కనీసం దాన్ని కూడా చూడకుండా, తాము స్పందించలేదని వ్యాఖ్యానించడం వెనుక అసలు అర్థమేంటని ఆయన ప్రశ్నించారు.

ఆయనకు వివరాలు కావాలంటే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఒక్క దరఖాస్తు చేస్తే, సమస్త సమాచారం చేతికి అందుతుందని, కనీసం అదికూడా తెలియకుండా పోయిందని అన్నారు. తాను ఆయనకు ఒక్కటే విషయాన్ని చెప్పదలచుకున్నానని, మట్టిని, నీటిని అవహేళన చేయకూడదని, రాష్ట్రంలో 80 శాతం మంది మట్టిని నమ్ముకుని బతుకుతున్నవారేనని, కేంద్రం ఇచ్చిన నిధులపై ఎంతగా చెబుతున్నా, ఆయనకు ఎందుకు అర్థం కావడం లేదని సుధీష్ ప్రశ్నించారు. ఆయనకు మంత్రి కావాలనో, ముఖ్యమంత్రి కావాలనో ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన సొంతంగా రాజకీయాల్లో రాణించాలని భావించడం తప్పు కాదని, ఇదే సమయంలో తమపై నిందలు మోపుతుంటే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. 
Pawan Kalyan
Jana Sena
Sudhish Rambotla
BJP

More Telugu News