Pawan Kalyan: నేటితో ముగియనున్న పవన్ కల్యాణ్ డెడ్ లైన్... వాట్ నెక్ట్స్?

  • ఫిబ్రవరి 15లోగా ఏపీకి కేంద్ర సాయంపై ప్రకటన చేయాలి
  • గతంలో పవన్ పెట్టిన డెడ్ లైన్ 
  • ఇంతవరకూ రాని సమాధానం
  • పవన్ తదుపరి చర్యలపై సర్వత్ర ఆసక్తి
విభజన హామీల సాధన కోసం తనదైన మార్గంలో ముందుకు వెళుతున్న పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టిన డెడ్ లైన్ నేటితో ముగియనుండటంతో, తదుపరి ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారన్న విషయమై ఆసక్తి నెలకొంది. ఏపీకి చేసిన సాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 15లోగా వివరణ ఇవ్వాలని గతంలో పవన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది.

 ఇప్పటికే లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ లతో చర్చలు జరిపిన జనసేనాని, రేపు వామపక్ష నేతలను, జేఎఫ్సీ ప్రతినిధులను కలసి వారితో చర్చించనున్నారు. రఘువీరా రెడ్డి వంటి కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలతోనూ ఆయన మాట్లాడే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక తాను పెట్టిన డెడ్ లైన్ ముగిసేలోగా, ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను పవన్ కల్యాణ్, రేపే ప్రకటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుండగా, ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు విభజన డిమాండ్ల సాధన నిమిత్తం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 5న న్యూఢిల్లీలో భారీ ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా పాల్గొననున్నాయి. కాగా, బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సభలో ఒత్తిడి పెంచుతూ వేచి చూడాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

 అవే సమావేశాలు ముగిసేలోగా ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించకుంటే, ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని వైకాపా అధినేత జగన్, కీలక ప్రకటన చేసి అధికార పార్టీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు. కేంద్రం హామీలను అమలు చేయకుంటే తీవ్ర నిర్ణయాలుంటాయని టీడీపీ నేతలు ఓపక్క హెచ్చరిస్తున్నప్పటికీ, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ నాయకుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే ఏపీలో విభజన హామీల సాధనకు పవన్ ఎటువంటి అడుగులు వేస్తారన్నది వేచి చూడాలి.
Pawan Kalyan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News