somu veerraju: టీడీపీ-బీజేపీ బంధానికి బీటలు వారింది ఇక్కడే.. వివరించిన వీర్రాజు

  • అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదనే టీడీపీ యాగీ 
  • బయటకు మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కలరింగ్ 
  • సీట్లు పెంచి ఉంటే టీడీపీ నోరెత్తేది కాదు
  • ఓ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ మధ్య ఉన్న బంధం కేంద్ర బడ్జెట్ తర్వాత దాదాపు బీటలు వారే స్థితికి చేరుకుంది. బడ్జెట్‌లో  ఏపీకి అన్యాయం జరిగిందని, దానిని సరిదిద్దాల్సిందేనని టీడీపీ ఎంపీలు లోక్‌సభలో నిరసన తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేసే వరకు వెనక్కి తగ్గొద్దని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే వారిని ఆదేశించారు. దీంతో టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. తాము ఎంతో చేశామని రాష్ట్ర బీజేపీ నేతలు.. ఏమిచ్చారని టీడీపీ నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కింది.

ఇక టీడీపీ నేతలపైనా, ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనా విమర్శలు చేయడంలో బీజేపీలోని ఇతర నేతలతో పోలిస్తే ఎమ్మెల్సీ  సోము వీర్రాజు ముందున్నారు. చంద్రబాబు సహా ఏ ఒక్కరినీ ఆయన వదల్లేదు. తాజాగా ఆయన ఓ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీడీపీ-బీజేపీ మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాన్ని వివరించారు.
 
అసెంబ్లీ సీట్ల పెంపు ప్రస్తుతం అయ్యే పని కాదని తెలియడమే టీడీపీ కోపానికి అసలు కారణమని వీర్రాజు వివరించారు. ప్రస్తుతం ఏపీలో 175 శాసనసభ సీట్లు ఉండగా, వాటిని 225కు పెంచాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. అయితే ఈ విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి హామీ రాలేదని, అవి పెంచనందుకే టీడీపీ నానాయాగీ చేస్తోందని ఆరోపించారు. సీట్లు కనుక పెంచి ఉంటే టీడీపీ నోరు మెదిపి ఉండేదే కాదన్నారు. మనసులో ఇది పెట్టుకుని బయటకు మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని, రాజకీయ లబ్ధి కోసమే ఆందోళన చేస్తోందని వీర్రాజు దుయ్యబట్టారు.
somu veerraju
BJP
Telugudesam
Union Budget 2018-19

More Telugu News