TRS: ‘జై ఆంధ్రా’ అన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత.. లోక్‌సభలో టీడీపీకి అండ!

  • లోక్‌సభలో టీడీపీ ఆందోళనకు మద్దతు
  • వారి ఆందోళనలో నిజముందన్న ఎంపీ
  • విభజన హామీలు నెరవేర్చాల్సిందేనని డిమాండ్
లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన ప్రసంగం అందరినీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకట్టుకుంటోంది. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు సభలో మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. బడ్జెట్‌లో అన్యాయానికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు బంద్ నిర్వహించాయి. ఇక సభలో వరుసగా మూడో రోజు కూడా టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు. కాసేపు గందరగోళం సృష్టించారు.

ఈ క్రమంలో సభలో ఇంగ్లిష్, హిందీలో మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత టీడీపీ ఎంపీల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. ఇంకా ఏపీ, తెలంగాణలోని పలు సమస్యలను ప్రస్తావించిన కవిత చివరల్లో ‘జై ఆంధ్రా’ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ఆమె ప్రసంగాన్ని విన్న తెలుగు ప్రజలు ఖుషీ అయిపోతున్నారు. ఏపీ సమస్యల గురించి ప్రస్తావించి టీడీపీ ఎంపీల నిరసనకు మద్దతు తెలిపినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సభలో మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన టీడీపీ సభ్యులు, కవిత మాట్లాడుతున్నంత సేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. 
TRS
Telugudesam
K Kavitha
Lok Sabha

More Telugu News