BJP: టీడీపీతో పొత్తు కొనసాగుతుంది.. అసందర్భంగా మాట్లాడితే చర్యలు.. బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్

  • 2019 ఎన్నికల్లో టీడీపీతో కలిసే వెళ్తాం
  • విశాఖ రైల్వే జోన్‌పై ఒడిశాతో చర్చలు
  • పోలవరం గురించి అందుకే బడ్జెట్‌లో మాట్లాడలేదు
  • తెలుగు రాష్ట్రాల నేతలతో బీజేపీ చీఫ్ అమిత్ షా
ఏపీ బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లేందుకే నిర్ణయించుకున్నామని, కాబట్టి మిత్ర ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు.

గంటన్నరపాటు జరిగిన భేటీలో పలు విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై నేతలకు స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీ చేస్తామని, ఈ విషయంలో ఎటువంటి మార్పు ఉండబోదని నేతలకు తేల్చి చెప్పారు. మిత్రధర్మానికి వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని సొంత పార్టీ నేతలను షా హెచ్చరించారు. టీడీపీతో దోస్తీ కటీఫ్ అంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అమిత్ షా ఈ రకంగా తెరదించారు.

విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడుతూ ఈ విషయంలో ఒడిశాతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య ఉండదని పేర్కొన్న అమిత్ షా.. నాబార్డు రుణాలు ఇస్తున్నందు వల్లే బడ్జెట్‌లో పోలవరం గురించి ప్రస్తావించలేదని వివరించారు.
BJP
Amit shah
Andhra Pradesh
Telangana

More Telugu News