Telangana: 'ఇట్స్ ఫన్నీ' ఘటనపై కలెక్టర్ ఆమ్రపాలిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్!

  • రిపబ్లిక్ డే ప్రసంగంతో వివాదాస్పదమైన కలెక్టర్
  • ఆమెకు స్వయంగా ఫోన్ చేసిన ఎస్పీ సింగ్ 
  • హుందాగా వ్యవహరించాలని సూచన
రిపబ్లిక్ డే ప్రసంగం చేస్తూ నవ్వులపాలైన వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. గత శుక్రవారం నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఆమ్రపాలి తెలుగులో ప్రసంగిస్తూ మధ్యమధ్యలో నవ్వుతూ, వెనక్కి తిరిగి చూడటం వంటి చర్యల కారణంగా ఆమెపై విమర్శలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ స్వయంగా ఈరోజు ఆమెకు ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ విషయమై ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న ఆమెను హుందాగా వ్యవహరించాలని సూచించారని సమాచారం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా ఆమ్రపాలి చెప్పినట్టు సంబంధిత వర్గాల సమాచారం.

కాగా, హన్మకొండలోని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ అకారణంగా నవ్వడం, సంబంధిత అంశాలకు సంబంధించిన గణాంకాలను ప్రకటించేటప్పుడు తడబడటం చేశారు. అంతేకాకుండా, ప్రసంగం మధ్యలో ‘ఇట్స్ ఫన్నీ’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, వచ్చే నెల 18న ఢిల్లీ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ఆమ్రపాలి వివాహం జరగనుంది.
Telangana
Warangal Urban District
collector amrapali

More Telugu News