Telangana: చివరి ఆయకట్టు రైతులకూ నీరందేలా చూడాలి: మంత్రి హరీశ్ రావు ఆదేశాలు

  • ఎస్సారెస్పీ, ఎన్ఎస్ఎమ్, నిజాంసాగర్ ప్రాజెక్టులపై సమీక్ష
  • సాగునీటి క్రమబద్ధీకరణలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈ.ఈ.లదే బాధ్యత
  •  యాసంగిలో చివరి ఆయకట్టు రైతుకూ సాగునీరందాలి
  • హరీశ్ రావు ఆదేశాలు
శ్రీరాంసాగర్‌ (ఎస్సారెస్పీ), నాగార్జున సాగర్ (ఎన్ఎస్పీ), నిజాంసాగర్ ప్రాజెక్టులలో చివరి ఆయకట్టు రైతులకు కూడా నీరందేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు రబీ పంటలకు సాగునీటి సరఫరాను క్రమబద్ధం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మూడు ప్రాజెక్టుల ఆయకట్టుకు జరుగుతున్న సాగునీటి సరఫరాపై హైదరాబాద్ జలసౌధలో ఈరోజు సమీక్షించారు.

ఆయా కాలువల వెంట సంబంధిత అధికారులు, ఇతర సిబ్బంది నిరంతరం తిరగాలని, సాగునీటి సరఫరా తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పర్యవేక్షించాలని, జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని, రెవెన్యూ సిబ్బందితో సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. సాగునీటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈ.ఈ.లదే బాధ్యత అని, వారిపై చర్యలకు ప్రభుత్వం వెనుకాడబోదని హెచ్చరించారు. నీటిని వదిలినప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాత్రీపగలూ పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో రబీ ఆయకట్టును కాపాడాలని, ప్రధాన కాలువలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీటిని సరఫరా చేస్తున్నందున దిగువనున్న రైతులకు నీరందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీరామ్ సాగర్ లోయర్, మానేరు డ్యామ్ ఎగువ, లోయర్ మానేరు డ్యామ్ దిగువ ప్రాంతాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటరీలు, ఎన్.ఎస్.పి. ఎడమ కాలువ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీలు, నిజాంసాగర్ కింద కాలువల పరిధిలోనూ, ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై క్షేత్ర స్థాయి పరిస్థితిని మంత్రి సమీక్షించారు. ఎస్సారెస్పీ ఎల్ఎండి ఎగువ ప్రాంతాల్లో 4,07,417 ఎకరాలు, ఎల్ఎండి దిగువ భాగాన 1,52,588 ఎకరాలు, ఎన్ఎస్పీ కింద 5,25,629 ఎకరాలు, నిజాంసాగర్ కింద 1,51,666 ఎకరాలకు ఈ యాసంగిలో తప్పనిసరిగా సాగు నీరందించాలని హరీష్ రావు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశం లో ఈ.ఎన్.సి. మురళీధరరావు, సి.ఈ.లు శంకర్, సునీల్, మధుసూధనరావు ,ఎస్.ఈ, ఈ.ఈ.లు పాల్గొన్నారు.  
Telangana
Harish Rao

More Telugu News