Nalgonda District: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య

  • దారుణ హత్యకు గురైన శ్రీనివాస్
  • నివాసం సమీపంలోనే హత్య 
  • అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన నిందితులు
తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అనుచరుడు, నల్గొండ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురయ్యారు. తన నివాసం సమీపంలోనే ఆయన హత్యకు గురయ్యారు. నల్గొండలోని సావర్కర్ నగర్ లో కుటుంబంతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఆ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఘర్షణపడ్డారు. ఈ విషయంలో స్థానిక కౌన్సిలర్‌ కుమారుడు మెరగు గోపి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఘర్షణ సద్దుమణగలేదు.

దీంతో గోపి, శ్రీనివాస్‌ కు ఫోన్‌ చేసి విషయం వివరించగా, ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్‌ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరగింది. ఈ క్రమంలో శ్రీనివాస్‌ తలపై బండరాయితో మోది హత్య చేసి, పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసిన నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. దీంతో పట్టణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. సమాచారం అందుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాదు నుంచి నల్గొండ చేరుకుని శ్రీనివాస్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. 
Nalgonda District
murder
srinivas
komatreddy venkatreddy

More Telugu News