Cameramen: హైదరాబాద్ లో కలకలం... టీవీ చానెల్ కెమెరామెన్ ను కత్తితో పొడిచిన కో-డైరెక్టర్!

  • ఇందిరానగర్ లో ఘటన
  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన కెమెరామెన్
  • పరారీలో కో-డైరెక్టర్, కేసు నమోదు
తెలుగు సినీ ఇండస్ట్రీలో కో-డైరెక్టర్ గా పని చేస్తున్న రాంరెడ్డి అనే వ్యక్తి, ఓ టీవీ చానల్ లో కెమెరామెన్ గా ఉన్న కృష్ణ భవన్ రాజు అలియాస్ వర్మపై దారుణంగా కత్తితో దాడి చేయడం హైదరాబాద్ పరిధిలోని ఇందిరానగర్ లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా, ముమ్మడివరం మండలం, అయినపురం గ్రామానికి చెందిన కృష్ణ భవన్‌ రాజు ఇందిరానగర్ లో ఉంటుండగా, అతనికి రాంరెడ్డి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలసి ఒకే గదిలో అద్దెకు ఉంటున్నారు.

తరచూ నిద్రలో లేచే రాంరెడ్డి, తనను ఎవరో చంపడానికి వస్తున్నారని అరుస్తుండేవాడు. అదే విషయాన్ని 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసేవాడు. ఆపై పోలీసులు విచారించి, అది అపోహ మాత్రమేనని కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతుండేవారు. ఈ క్రమంలో రాత్రి ఒంటిగంట సమయంలో వర్మ మేడపై ఉండగా, కూరగాయల కత్తితో వచ్చి రాంరెడ్డి దాడి చేసి, పొట్టలో పొడిచాడు. ఈ క్రమంలో వర్మ చేతులకు కూడా గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగెత్తాడు. అయినప్పటికీ రాంరెడ్డి వెంబడించడంతో, ఓ ఏటీఎం పక్కన నక్కాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయిన వర్మను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని నిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్చారు. రాంరెడ్డి పరారీలో ఉన్నాడని, కేసు దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Cameramen
Co-Director
Hyderabad
Indiranagar

More Telugu News