Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ పొలిటికల్ లాబీయింగ్ లో ఉన్నారు!: ప్రొఫెసర్ నాగేశ్వర్

  • సమాజంలో మార్పు తీసుకురావాలనే  ఆకాంక్ష ఆయనలో ఉంది
  • పూర్తి స్థాయి రాజకీయాలు నడిపే పద్ధతి వేరేగా ఉంటుంది
  • పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ పొలిటికల్ లాబీయింగ్ లో ఉన్నారు
  • ఓ టీవీ ఛానెల్ చర్చలో నాగేశ్వర్ వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన బలమేంటో తనకే అర్థం కావట్లేదని చెబుతున్నారని, ఇంకా ఆయన బలం గురించి తానేమి చెబుతానని, అది కష్టమైన విషయమని సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ‘ఏబీఎన్’ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తాడని, ఆయనకు కొన్ని శక్తిసామర్థ్యాలతో పాటు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారని, సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన ఆకాంక్ష ఆయనలో ఉందని అన్నారు.

కానీ, పూర్తి స్థాయి రాజకీయాలు నడిపే పద్ధతి వేరేగా ఉంటుందని, సంబంధిత అంశాలపై పోరాటం చేయడం, ప్రజలను సమీకరించడం వంటివి ఉంటాయని అన్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ పొలిటికల్ లాబీయింగ్ లో ఉన్నారని, ఏదైనా సమస్యను గుర్తించి..చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి, ఆయన ద్వారా పరిష్కారం చేయిస్తున్నారని అన్నారు. రాజకీయపార్టీలు లాబీయింగ్ ద్వారా కాకుండా రాజకీయాల వల్లే అభివృద్ధి చెందుతాయని, లాబీయింగ్ అనేది స్వచ్ఛంద సంస్థలు లేదా రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులు చేసే పని అని అన్నారు.

 సమస్యలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకే అయితే, రాజకీయ పార్టీని పవన్ స్థాపించాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించారు. అపారమైన జనాదరణ పొందిన నటుడు పవన్ కల్యాణ్ కు సొంతంగా ఏ రాజకీయపార్టీ లేకున్నా కూడా ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లొచ్చని, ఆయా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లొచ్చని సూచించారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ కార్యాచరణ ఉండాలనేది తన అభిప్రాయమని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.
Pawan Kalyan
Andhra Pradesh
Telangana

More Telugu News