Narendra Modi: ఆప్త మిత్రుడు మోదీతో కలసి రోడ్ షోలో పాల్గొననున్న ఇజ్రాయెల్ ప్రధాని!

  • ఆరు రోజుల పర్యటనకు వస్తున్న నెతన్యాహు
  • మిత్రుడితో కలసి అహ్మదాబాద్ లో రోడ్ షో
  • పర్యటనలో కీలక ఒప్పందాలు
గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధాని మోదీ మరో రోడ్ షో నిర్వహించబోతున్నారు. వచ్చే వారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలసి ఈ షోను నిర్వహిస్తున్నారు. ఓపెన్ టాప్ జిప్సీలో వీరి రోడ్ షో జరగబోతోంది. ఎయిర్ పోర్ట్ నుంచి మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమం వరకు వీరి రోడ్ షో 9 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.

ఆరు రోజుల పర్యటనకు గాను నెతన్యాహు భారత్ వస్తున్నారు. ఈ సందర్భంగా 17వ తేదీన మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్క రోజు గడపనున్నారు. తన పర్యటనలో భాగంగా ముంబైకి కూడా వెళ్లనున్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ లో సినిమాలు షూట్ చేసే అంశంపై బాలీవుడ్ ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు.

నెతన్యాహు భారత పర్యటన ఢిల్లీలో ప్రారంభం అవుతుంది. ప్రధాని మోదీతో విందు ఆరగించిన తర్వాత ఆయన విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ తో భేటీ అవుతారు. మరుసటి రోజు రాష్ట్రపతి కోవింద్ ను కలుస్తారు. అనంతరం మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం ఆయన తాజ్ మహల్ ను సందర్శిస్తారు.

నెతన్యాహుతో పాటు 130 మంది వ్యాపారవేత్తలు కూడా భారత్ కు విచ్చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశలో భాగంగా నెతన్యాహు భారీ బిజినెస్ డెలిగేషన్ తో వస్తున్నారు. తన వస్తువులను విక్రయించుకునేందుకు ఇజ్రాయెల్ కు భారీ మార్కెట్ అవసరం ఉంది. ఈ క్రమంలోనే, భారత్, చైనాలతో బంధాలను పటిష్టం చేసుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తోంది.

మోదీ, నెతన్యాహూల చర్చల్లో అత్యంత కీలకమైన రాఫెల్ అడ్వాన్స్ డ్ డిఫెన్స్ సిస్టం కూడా ఉండబోతోంది. 500 మిలియన్ డాలర్ల విలువైన స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ పై ఒప్పందం కూడా జరగనుంది. ఇప్పటికే భారత్ కు ఇజ్రాయెల్ 'మేజర్ వెపన్స్ సప్లయర్'గా ఉంది.

గత జూలైలో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు నెతన్యాహు నుంచి ఘన స్వాగతం లభించింది. మోదీని నెతన్యాహు 'ఆప్త మిత్రుడు'గా అభివర్ణించారు. ఎయిర్ పోర్ట్ వద్ద స్వాగతం పలికిన దగ్గర్నుంచి మూడు రోజుల పర్యటన ఆసాంతం మోదీ పక్కనే నెతన్యాహు ఉన్నారు. అంతేకాదు, వారిద్దరూ కలసి ఉన్న ప్రతి సన్నివేశాన్ని చాలా అద్భుతంగా ఫొటో, వీడియో షూట్ చేశారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్న సన్నివేశాలు, పాదరక్షలు లేకుండా బీచ్ లో ఎంజాయ్ చేసిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Narendra Modi
Benjamin Netanyahu
Benjamin Netanyahu india visit

More Telugu News