cpi narayana: సైకిల్ పై అమరావతిలో సీపీఐ నారాయణ చక్కర్లు.. తాటి చెట్టు పక్కన ఆగి కల్లు తాగిన నేత.. వీడియో చూడండి!

  • హఠాత్తుగా సచివాలయానికి వచ్చిన నారాయణ
  • చంద్రబాబు ప్లాన్ బాగుందంటూ కితాబు
  • రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్న నేత
సీపీఐ జాతీయ నేత నారాయణ ఏపీ రాజధాని అమరావతిలో సైకిల్ పై చక్కర్లు కొట్టారు. ఉదయం 7 గంటలకే ఆయన సచివాలయానికి వచ్చారు. హఠాత్తుగా ఆయన రావడంతో భద్రతా సిబ్బంది ఉలిక్కి పడ్డారు. సచివాలయం చూడ్డానికి వచ్చానని, తనను లోపలకు పంపాలని సిబ్బందిని కోరగా... ఈ సమయంలో ఎవరూ లేరంటూ సిబ్బంది చెప్పారు. దీంతో, సచివాలయం లాన్ లోనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారాయన. ఈ సందర్భంగా ఎన్టీఆర్ క్యాంటీన్ ను సందర్శించారు. అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఓ తాటి చెట్టు వద్ద ఆగి, కల్లు రుచి చూశారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్ బాగుందంటూ కితాబిచ్చారు. దీర్ఘకాలిక ఆలోచనలతో రోడ్లను వేస్తున్నారని చెప్పారు. బాబు ఆలోచనలు బాగా ఉన్నప్పటికీ... ఆచరణలో పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పైకి నవ్వులు చిందిస్తూ, నిధుల విషయంలో మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కూడా కేంద్రానిదే అని అన్నారు.

చంద్రబాబు, జగన్ లు కేసులకు భయపడి మోదీని ఏమీ అనలేక పోతున్నారని.. భయపడి, బతిమిలాడితే నిధులు రావని నారాయణ చెప్పారు. జైలుకు వెళ్తే ఏమవుతుందని... ఆ తర్వాత హీరోలవుతారని అన్నారు. ఇప్పుడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను జైల్లో పెట్టారని... 2019 లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఆయన సత్తా ఏంటో చూపిస్తారని తెలిపారు. మోదీ సత్తా ఏంటో మొన్నటి తమిళనాడు ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో బీజేపీ ఇరకాటంలో పడిపోయిందని అన్నారు. ఇకనైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
cpi narayana
cpi narayana in amaravathi
narayan drinking kallu

More Telugu News