KCR: నవంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు... ముందస్తుకు సమాయత్తం కావాలని కేసీఆర్ ఆదేశం!

  • 2018-19 బడ్జెట్ తరువాత నియోజకవర్గాలపై దృష్టి
  • ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
  • సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలమే
  • ప్రజా ప్రతినిధులతో కేసీఆర్!
ఈ సంవత్సరం చివరిలోగానే పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. 2018-19 బడ్జెట్‌ తర్వాత ప్రతి ఒక్కరూ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించిన ఆయన, కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే, అనివార్యంగా తెలంగాణ కూడా వెళ్లక తప్పదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. తాను చేయించిన వివిధ సర్వేల్లో పరిస్థితులు టీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉన్నాయని, కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, వాటిని సర్దు కోవచ్చని వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఆర్నెల్ల ముందే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో బీజేపీ ఉందని, ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి పూర్తి కానుండగా, మరో ఎనిమిది రాష్ట్రాలకు వచ్చే ఏడాది జూన్‌ లోగా ఎన్నికలు జరగాల్సి వుందని, దేశమంతా ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలంటే, ఈ సంవత్సరం 13 రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం తప్పనిసరని కూడా కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. కాగా, టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆహ్వానించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనపై ఇంకా ఆశలు పోలేదని, 15న జరిగే కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ విషయమై స్పష్టత వస్తుందని ఆయన ప్రజా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు.
KCR
Telangana
General Elections
Assembly Elections

More Telugu News