Rajinikanth: రజనీకాంత్‌కు నకిలీల బెడద.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ వెబ్‌సైట్లు.. అభిమానుల ఆందోళన!

  • అయోమయానికి గురిచేస్తున్న బోగస్ వెబ్‌సైట్లు
  • సభ్యత్వ స్వీకరణకు ప్రజలను నేరుగా కలవడమే మంచిదంటున్న అభిమానులు
  • కొత్తగా వాట్సాప్ గ్రూపు ప్రారంభం
రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించిన తర్వాత ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించి సభ్యులుగా చేరాలని ప్రజలకు రజనీకాంత్ పిలుపు ఇచ్చారు. అయితే సభ్యులుగా చేరేందుకు ఆసక్తితో వెళ్లే వారికి బోగస్ వెబ్‌సైట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఏది అసలైనదో, ఏది బోగసో తెలియక అభిమానులు అయోమయంలో పడిపోతున్నారు.

తాను ప్రారంభించబోయే పార్టీలో చేరాలనుకున్న వారు, తనతో కలిసి నడవాలనుకున్నవారు సభ్యులుగా చేరాల్సిందిగా కోరుతూ www.rajinimandram.org అనే వెబ్‌సైట్‌ను రజనీకాంత్ ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా 50 లక్షల మంది సభ్యులుగా చేరారు. మరెంతోమంది చేరేందుకు సిద్ధమవుతుండగా బోగస్ వెబ్‌సైట్లు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ పేరుతో మూడు బోగస్ వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ‘తలైవర్ మన్రం’, ‘రజనీ మంద్రం’, ‘కేస్ తమిళనాడు’ పేరుతో ఇవి కనిపిస్తుండడంతో ఏది అసలో, ఏది నకిలీయో తెలియడం లేదని ‘తలైవా’ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బోగస్ వెబ్‌సైట్ల కారణంగా అభిమానులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. వెబ్‌సైట్ ద్వారా కాకుండా అభిమానులను, ప్రజలను నేరుగా కలుసుకుని దరఖాస్తు పత్రాల ద్వారా సభ్యత్వం చేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రజనీకి మొత్తం 50 వేలకుపైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారా సభ్యత్వ నమోదు చేయడమే మంచిదని చెబుతున్నారు. కాగా, రజనీకాంత్ పేరుతో అభిమాన సంఘాలు గురువారం కొత్తగా వాట్సాప్ గ్రూపును ప్రారంభించాయి.
Rajinikanth
Tamilnadu
Website

More Telugu News