Chandrababu: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్!

  • విజయవాడలో కూలగొట్టిన ఆలయాలకు అతీగతీ లేదు
  • ప్రభుత్వ చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి
  • ‘పోలవరం’, రాజధాని నిర్మాణాల భారం దేవుడిదేననడం సబబు కాదు:  మాధవ్ విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబుపైన, టీడీపీపైన ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో కూలగొట్టిన దేవాలయాలకు ఇప్పటివరకూ అతీగతి లేదని, రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ పథకాల్లో నాణ్యత ఉండటం లేదని, రేషన్ లో రద్దయిన సరుకులను తిరిగి ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణాల భారం దేవుడిదేనంటూ చంద్రబాబు అనడం సబబు కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, కచ్చితంగా అందుతాయని, అందులో ఎటువంటి అనుమానం లేదని అన్నారు. కాగా, టీడీపీపైన, ఆ పార్టీ నేతలపైనా బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను మరవకముందే, అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Chandrababu
BJP

More Telugu News