Harish Rao: కేసీఆర్ ఇచ్చిన మాట నిజం కావాలి: హరీశ్ రావు

  • కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి తాత్సారం తగదు 
  • కాళేశ్వరం డెడ్ లైను మే 31
  • టైమ్ ఫ్రేమ్ తో పని చేయాలి
  • కాళేశ్వరం అత్యంత ప్రతిష్ఠాత్మకం

కాళేశ్వరం ప్రాజెక్టు పనులలో ఎలాంటి జాప్యం ఇకపై కుదరదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల గేట్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు చెప్పారు. ఈ రోజు అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ... గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుందిళ్ళ బ్యారేజీ సైటులో సుందిళ్ళ పనులతో పాటు, ప్యాకేజి 6, 7 పనులను ఆయన ఈ రోజు సమీక్షించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడరాదని మంత్రి అన్నారు. ప్యాకేజి 7లో పనులను మరింత వేగవంతం చేయాలని కోరారు.

తెలంగాణ రైతులు, ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టే క్రమంలో సహకరించాలని ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలను హరీశ్‌రావు కోరారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులలోనైనా జూన్ కల్లా పూర్తి చేయవలసిందేనని హరీశ్ రావు అన్నారు. ఇందుకు గాను పక్కా కార్యాచరణ ప్రణాళికతో, ఒక రోడ్ మ్యాప్ ప్రకారం పనులు చేయాలన్నారు. వచ్చే మే 31 ని డెడ్ లైనుగా ఖరారు చేసుకొని పనుల పురోగతిని సాధిస్తే జూన్ లో అన్ని పనులు పూర్తి అవుతాయన్నారు.

ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి..

జనవరి నుంచి జూన్ వరకు ప్రతి వారం, ప్రతి నెల ఏ పని పురోగతి ఎంత జరుగుతున్నదో ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏ రోజు ఎంత మేరకు పని జరిగిందో ప్రోగ్రెస్ రిపోర్ట్ ను మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు వాట్సప్ లో తనకు చేరాలని మంత్రి ఇరిగేషన్ ఈ.ఈ.లను ఆదేశించారు. ఈ.ఈ. లు తమ పరిధిలోని ప్యాకేజీలు, ఇతర నిర్మాణ పనులను నిరంతరం సమీక్షించాలని, పనులలో ఎక్కడైనా జాప్యం ఉంటే సరిదిద్దాలని కోరారు.

మూడు రోజుల పాటు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తా..

కాళేశ్వరంకు చెందిన 3 బ్యారేజీలు, 3 పంపు హౌజ్ ల పనుల పురోగతిని మంత్రి ఈ సమావేశంలో సమీక్షించారు. ఇది వరకు నిర్ణయించినట్టు మార్చి, ఏప్రిల్, జూన్ లలో మూడు పంపులను బిగించడం, వాటిని నడపడం వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని హరీశ్ రావు అన్నారు. తాను జనవరి 17 వతేదీ నుంచి మూడు రోజుల పాటు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని హరీశ్ రావు తెలిపారు. ఇకపై రెగ్యులర్ గా ఈ ప్రాజెక్టు పనులను మానిటర్ చేస్తానన్నారు. ఈ సమీక్షలో కాళేశ్వరం సి.ఈ.ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్.ఈ,ఈ.ఈ.లు,వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

More Telugu News