పొట్టి వీరయ్య: ‘మెగా’సాయంపై హాస్యనటుడు పొట్టి వీరయ్య సంతోషం

  • ఏదైనా ‘మెగాస్టార్....మెగాస్టారే’
  • ‘మా’ అసోసియేషన్ గతంలో కూడా నా కుటుంబాన్ని ఆదుకుంది
  • సినీ అవకాశాలొస్తున్నా వయసు రీత్యా నటించలేకపోతున్నా
  • హాస్యనటుడు పొట్టి వీరయ్య వెల్లడి
హాస్య‌న‌టుడు పొట్టి వీర‌య్య ఆర్థిక ప‌రిస్థితి బాగుండకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టివీరయ్య మాట్లాడుతూ, చిరంజీవి తనకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారని, ఏదైనా ‘మెగాస్టార్....మెగాస్టారే’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తన ఆర్థిక పరిస్థితి బాగుండలేదంటూ పత్రికలో వచ్చిన కథనం చదివిన చిరంజీవి సతీమణి సురేఖ, ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పడంతో ఆయన స్పందించారని చెప్పారు.

‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాను తన ఇంటికి పిలిచి రూ.2 లక్షల చెక్కు ఇచ్చిన చిరంజీవి, ఆ చెక్కును తనకు ఇవ్వాలని చెప్పారని అన్నారు. తనను ‘మా’ కార్యాలయానికి పిలిపించి ఆ చెక్కును శివాజీరాజా అందజేశారని తెలిపారు. ‘మా’ అసోసియేషన్ గతంలో తనకు చాలా సాయం చేసిందని, తన భార్యకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ‘మా’ ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు, చిరంజీవి తన కుటుంబాన్ని ఆదుకున్నారని, సినీ పరిశ్రమ నుంచి తనకు అందరి సహకారం ఉందని అన్నారు. ప్రస్తుతం ఆయనకు లభిస్తున్న సినీ అవకాశాల గురించి ప్రశ్నించగా.. నటించే అవకాశాలు వస్తున్నప్పటికీ, వయసు రీత్యా నటించే పరిస్థితిలో లేనని, తనకు డెబ్భై ఏళ్లని పొట్టివీరయ్య తెలిపారు.
పొట్టి వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి

More Telugu News