Amarnathreddy: మంత్రి అమరనాథరెడ్డిని గుడిసెలోకి లాక్కెళ్లిన అవ్వ!

  • ఎందరు అధికారులతో మొర పెట్టుకున్నా తీరని సమస్యలు
  • మంత్రిని ఏకంగా తన గుడిసెలోకి లాక్కెళ్లిన వృద్ధురాలు
  • వెంటనే పక్కా ఇల్లు మంజూరు చేయాలని మంత్రి ఆదేశం
తన సమస్యలను ఎందరు అధికారులకు చెప్పుకున్నా ఫలితం కలగడం లేదన్న కోపం, ఏపీ మంత్రి అమరనాథరెడ్డి, తన గ్రామానికి వస్తున్నాడని తెలిసిన వేళ ఆ అవ్వలో బయటపడింది. తమ వీధిలోనే ఆయన కనిపించడంతో, అప్పటికే అధికారుల వైఖరితో విసిగి, వేసారిపోయి ఉన్న ఆమె, ఆయనకు తన కష్టాలను ప్రత్యక్షంగా చూపించాలని భావించింది. ఆయన చెయ్యి పట్టుకుని తన గుడిసెలోకి లాక్కెళ్లింది. చిత్తూరు జిల్లా పెదపంజాణి మండలం చాపనేరులో పర్యటనకు అమరనాథరెడ్డి వెళ్లిన వేళ ఈ ఘటన జరిగింది.

 "మా గుడిసెను చూద్దువుగాని రా నాయనా" అంటూ తీసుకెళ్లింది. తన భర్తకు పింఛను రావడం లేదని, చలికి, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతూ గుడిసెలో ఉండలేకపోతున్నామని, కనీసం రేకుల ఇల్లయినా ఇప్పించాలని ప్రాధేయపడింది. దీనిపై స్పందించిన మంత్రి, వెంటనే ఆమెకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని, భార్య భర్తలు ఇద్దరికీ పింఛన్ వెంటనే శాంక్షన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
Amarnathreddy
Chittore Dist
Minister

More Telugu News