Andhra Pradesh: కర్నూలు జిల్లాలో మరో 'స్వాతి'.. ప్రియుడి మోజులో భర్త హత్య!

  • భర్త హత్యకు లక్ష రూపాయలతో ఒప్పందం
  • స్నేహితుడిగా నటించి హతమార్చిన కిరాయి హంతకుడు
  • విచారణలో అసలు విషయం వెలుగులోకి
ప్రియుడిని భర్త స్థానంలోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమై చివరికి కటకటాలపాలైన నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన స్వాతిని మర్చిపోకముందే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో ఇల్లాలు. బ్రాహ్మణపల్లెలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె చిన్న మద్దలేటి అలియాస్ మద్దయ్య (35), తన అక్క కుమార్తె వెంకటేశ్వరమ్మను ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన ముల్ల మహబూబ్ బాషాతో వెంకటేశ్వరమ్మకు ఏర్పడిన పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన మద్దయ్య భార్యను నిలదీశాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు బాషాతో  కలిసి వెంకటేశ్వరమ్మ హత్యకు ప్లాన్ చేసింది.

బేతంచెర్ల మండలంలోని బలపాలపల్లెకు చెందిన మనోహర్‌తో భర్త హత్యకు బేరం కుదుర్చుకుంది. లక్ష రూపాయలకు ఒప్పందం కుదరగా తొలుత రూ.80వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు. పథకం ప్రకారం మద్దయ్యకు మనోహర్ స్నేహితుడిగా మారాడు. ఈనెల 4న మద్దయ్యను పూడిచెర్లకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మద్దయ్య మత్తులోకి జారుకున్నాక బలపాలపల్లెకే చెందిన మల్లికార్జున్ సాయంతో మనోహర్ బండరాయి మోది మద్దయ్యను హతమార్చాడు.

తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వరమ్మను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య కేసు నమోదు చేసి నిందితులందరినీ అరెస్ట్ చేశారు.
Andhra Pradesh
Kurnool
Murder
Swathi

More Telugu News